గిగ్ వర్కర్.. ఈ పేరు కొత్తగా ఉన్నా.. అందరికీ సుపరిచితమే. ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్ ఇచ్చే పదార్థాలను.. వెజిటబుల్స్‌ను సమయం మీరకుండా ఇంటి ముందుకు తీసుకువచ్చే వారే.. గిగ్ వర్కర్స్. ఒక్క హైదరాబాద్‌లోనే వీరి సంఖ్య లక్ష మంది వరకు ఉందని నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన విషయం.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు లక్షల మంది వరకు ఉన్నారని లెక్క వేసింది. వీరు.. జొమాటో, బ్లింకిట్, స్విగ్గీ, ఉబర్ సహా పలు ఆన్‌లైన్ ఆధారిత కంపెనీల ద్వారా సమయానికి అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
అయితే.. ప్రైవేటు కంపెనీల తరహాలోనే వీరి శ్రమ కూడా దోపిడీకి గురి అవుతున్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే వీరి సంక్షేమానికి అనుకూలంగా.. కంపెనీల నుంచి వీరికి పారదర్శక రుసుములు, జీతాలు, బీమా వంటివి అందేటా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో చట్టాలు చేయాలనికూడా సూచించింది.
దీంతో జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడు వంటివి ఆదిశగా దృష్టి పెట్టాయి. అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వీరిపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు, నియమాలను అధ్యయనం చేసి.. మరింత పక్కాగా ముసాయిదా బిల్లునురెడీ చేశారు.
తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయా నిబంధనలను మంత్రులకు వివరించారు. దీనిని వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోసభలో ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు.
అనంతరం గవర్నర్ ఆమోదంతో ఈ బిల్లు చట్టం గా మారనుంది. అయితే.. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలు.. గిగ్ వర్కర్ల కష్టాన్ని బాగానే గుర్తించినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా లేని గిగ్ వర్కర్లకు ఈ బిల్లు రక్షణ ఛత్రంగా మారుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. దీంతో గిగ్ వర్కర్లు ముఖ్యమంత్రిని మరిచిపోలేరని.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.
ముసాయిదా బిల్లులో నిబంధనలు ఇవీ..
+ గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన యంత్రాంగం ఏర్పాటు చేస్తారు.
+ వీరికి చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
+ కార్మికులుగా వీరిని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ గుర్తిస్తుంది.
+ ఈ శాఖ ద్వారా అందించే పథకాలన్నీ వీరికి అందనున్నాయి.
+ కార్మిక శాఖ మంత్రి ఛైర్మన్‌గా 20 మంది సభ్యులతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తారు.
+ గిగ్ వర్కర్లకు సురక్షితమైన పని పరిస్థితులు హక్కుగా ఏర్పడతాయి.
+ వేతనం, కమీషన్ చెల్లింపులు, రేటింగ్‌లు పారదర్శంగా అందుతాయి.
+ గిగ్ వర్కర్ల పేర్ల నమోదు తప్పనిసరి.
+ కంపెనీలు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను ప్రభుత్వానికి అందించాలి.
+ గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. దీనిలో కంపెనీలు+ప్రభుత్వ వాటా ఉంటుంది.
+ గిగ్ వర్కర్ మరణించినా, ప్రమాదం జరిగినా ఆర్థిక సాయం చేస్తారు.
+ గిగ్ వర్కర్లను తొలగించాలంటే 7 రోజుల నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలి.


















