రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అయిపోయింది. 2024, జూన్ 10వ తేదీన ఏర్పడిన ప్రభుత్వం.. అనేక సంక్షేమ పథకాలు అదే సమయంలో పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో దూసుకుపోయింది అనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ 15 నెలల కాలంలో పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది.. అనేది టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి పరిశీలన చేసుకున్నారు. తాజాగా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ విషయంపై సీనియర్ నాయకులతో చర్చించారు. ఎప్పటికప్పుడు ఒక వైపు ప్రభుత్వాన్ని మరోవైపు పార్టీని కూడా అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించారు.
ప్రజల్లో ఉన్న బలం.. ఎన్నికల సమయానికి ఏ విధంగా వ్యవహరించాలో.. స్పష్టం చేయవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన. దీనికి తగ్గట్టుగానే ఆయన పార్టీ పరంగా ఈ 15 నెలల కాలంలో గ్రాఫ్ ఏ విధంగా ఉందన్నది సమీక్షించుకున్నారు. ఇతర వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారంతోపాటు తాను స్వయంగా చేయించిన ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం 15 మాసాలు గడిచిన తర్వాత కూడా పార్టీ స్పష్టమైన మెజారిటీతోనే ఉందని ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు.
నిజానికి ఆరు నెలల కిందట వైసిపి పుంజుకుంటుంది అన్న చర్చ తెరమీదకు వచ్చింది. దీనికి కారణం టిడిపి నాయకులు ఇసుక, మద్యం సహా ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం. అదేవిధంగా వివాదాలకు దారి తీసేలా వ్యవహరించడం వంటివి చంద్రబాబు దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని హెచ్చరించారు. అనేక సందర్భాల్లో మంత్రులను కూడా వదిలిపెట్టకుం డా వ్యవహరించారు. దీంతో మళ్లీ టిడిపి గ్రాఫ్ పుంజుకుందని స్పష్ట మైంది.
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకురావడం ఉపాధి కల్పన డీఎస్సీ నిర్వహణ అదేవిధంగా నెలల ఒకటో తారీఖున పింఛన్లు పంపిణీ, పేదలతో సీఎం మమేకమవుతున్న తీరు వంటివి ప్రభుత్వపరంగా మంచి మార్కులు వేయించేలా చేశాయి. ఎమ్మెల్యేలను ఎక్కడికి ఎక్కడ నిలువరించడం, ఆరోపణలు వచ్చిన వారిని వదిలిపెట్టకుండా వెంట పడడం వంటివి పార్టీ పరంగా చంద్రబాబుకు కలిసి వస్తున్నాయి. ఈ రెండు అంశాల్లోనూ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలనేది సీనియర్ నాయకులకు చంద్రబాబు చెప్పిన మాట. అంతే కాదు తాను సైతం ప్రతి మూడు నెలలకు పార్టీ పరమైన అంశాలను పరిశీలిస్తానని ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా బాధ్యులను ఊరుకునేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి పార్టీ పరంగా ప్రస్తుతం గ్రాఫ్ బాగానే ఉందన్నది చంద్రబాబు చెప్పిన మాట. వచ్చే నాలుగేళ్లలోనూ ఇదే తరహా పరిస్థితిని కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. తద్వారా మరోసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అంచనా వేస్తున్నారు.