తెలుగుదేశం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ అంతర్గత సమస్యలు, జిల్లా కమిటీలు, నామినేటెడ్ పోస్టులు భర్తీపై సీనియర్లతో చర్చిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు సీఎం టీడీపీ కార్యాలయంలోనే గడపనున్నారు. గత శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు వరుసగా రెండో శనివారం కూడా పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పూర్తిగా అధికార విధులకే పరిమితమైపోవడం, పార్టీ వ్యవహారాలను పట్టించుకోకపోవడం వల్ల అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో వారంలో ఒక రోజు పార్టీకి కేటాయించాలని సీఎం నిర్ణయించారు.
ఈ నెలలో చంద్రబాబు రెండుసార్లు, మంత్రి నారా లోకేశ్ ఒకసారి పార్టీ కార్యాలయానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతల క్రమశిక్షణ రాహిత్యంపై ముఖ్యమంత్రికి అందుతున్న ఫిర్యాదులపై ఈ రోజు చర్చిస్తారని అంటున్నారు. ప్రధానంగా తిరువూరు పంచాయతీపై ఈ రోజే తుది నిర్ణయం తీసుకుంటారని కూడా చెబుతున్నారు. గత వారం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న గొడవపై పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై చంద్రబాబుకు ఈ రోజు నివేదిక ఇవ్వనున్నారు. దీంతో తిరువూరు తగవుకు ఈ రోజే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా అధ్యక్షుల నియామకంపైనే శనివారమే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి గత మే నెలలో మహానాడు ముగిసిన వెంటనే జిల్లా కమిటీలు, రాష్ట్ర, జాతీయ కమిటీపై ప్రకటన రావాల్సివుంది. అయితే ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉండటం వల్ల కమిటీల ప్రకటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. మరో మూడు నెలల్లో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాల్సివుండటంతో జిల్లా కమిటీలను ప్రకటించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జిల్లా కమిటీలపై దాదాపు చర్చలు కొలిక్కి వచ్చినా, ఒకటి రెండు జిల్లాల అధ్యక్షుల ఎంపికపై పీటముడి వీడాల్సివుందని అంటున్నారు.
మరోవైపు పెండింగులో ఉన్న నామినేటెడ్ పోస్టుల నియామకంపైనా పార్టీ సీనియర్ల అభిప్రాయాలు సీఎం తెలుసుకుంటారని అంటున్నారు. నియోజకవర్గ స్థాయి పదవుల పంపకం, మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీల నియామకంపై తాత్సర్యం చేస్తున్న ఎమ్మెల్యేల వ్యవహారంపైనా చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, సీనియర్ల భేటీపై టీడీపీలో ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మండల, వార్డు, గ్రామ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

















