ఎన్నికలు ఇంకా దాదాపు ఏడాది ఉండగానే తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఓవైపు సీఎం స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసి వారసుడికి రంగం సిద్ధం చేశారు.. విశ్వ నటుడు కమల్ హాసన్ ను ఎంపీని చేసి ఆయన ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.. మరోవైపు తమిళ మహిళను జాతీయ అధ్యక్షురాలిగా చేసి తమిళ గడ్డపై సత్తాచాటాలని బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత ఆదరణ ఉన్న స్టార్ హీరో విజయ్ 2024లో రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించారు. తమిళ వెట్రిగ కళగం (టీవీకే) పేరిట పార్టీని స్థాపించారు.
ఇప్పుడు విజయ్ పార్టీ తమిళనాట ఒంటరిగా వెళ్తుందా? లేక ఏదో ఒక కూటమిలో చేరుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి ఓ సర్వేలో సీఎం అభ్యర్థిగా చాలామంది తమిళులు మరోసారి స్టాలిన్ కే ఓటు వేశారు. తదుపరి స్థానంలో కూడా విజయ్ లేరు. అయితే, ఇంకా ఏడాది ఉండగానే ఏమీ చెప్పలేం. టీవీకే ఇప్పటికే తొలి మహానాడును జరుపుకొంది. పార్టీ స్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. విజయ్ కూడా సీరియస్ రాజకీయ నాయకుడిగానే కనిపించారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు కూడా బడుగు, బలమీన వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉన్నాయి.
పాలనను పంచుకోవడం.. అధికారాన్ని పంచుకోవడం.. ఇదీ విజయ్ పార్టీ నినాదం. అయితే, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అని వెనక్కు తగ్గిన రజనీకాంత్, వచ్చి విఫలమైన కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల తరహాలో కాకుండా విజయ్ తన పేరులో పార్టీ పేరులో ఉన్న విజయాన్ని సాధిస్తారా? లేదా? అన్నది వచ్చే ఏడాది తేలనుంది. కాగా, తాజాగా తమ అధినేత విజయ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది విజయ్ పార్టీ. చాలా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నట్లే టీవీకేలోనూ వ్యవస్థాపకుడే సీఎం అభ్యర్థి అయ్యారు. ఆయనను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటూ టీవీకే కార్య నిర్వాహక మండలి తీర్మానం చేసింది. ఇప్పటికైతే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని విజయ్ పార్టీ చెబుతోంది.