ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త మహబూబ్‌పేట కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందటం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆ ఇల్లు లోపల విస్తరించిన నిశ్శబ్దం ఒక్కసారిగా భయంకర వాస్తవాన్ని బయటపెట్టింది.
కుటుంబ పెద్ద ఉప్పరి లక్ష్మయ్య (60), ఆయన భార్య వెంకటమ్మ (55), కుమార్తె కవిత (24), అల్లుడు అనిల్ (32), రెండు ఏళ్ల చిన్నారి అప్పు – అందరూ నిర్జీవంగా పడివుండటం చూసి ఆరా తీయడానికి వచ్చినవారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు తక్షణమే క్లూస్ టీమ్‌తో చేరుకున్నారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరించారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం వారిని వెంటాడుతోంది – ఇది ఆత్మహత్యా? లేక పక్కా హత్యా? పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. మరణానికి గల నిజమైన కారణం ఇంకా బయటపడలేదు. అయితే ఆ ఇంటి గోడల మధ్య నడిచిన చివరి క్షణాలు ఎలాంటి వైనమో అనుమానాలు మరింతగా రేకెత్తిస్తున్నాయి
ఇలాంటి సంఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2025 జనవరిలో బెంగళూరులో టెకీ అనూప్‌కుమార్, భార్య రాఖీ, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన గుర్తు వస్తోంది. ఆ ఇంటి సహాయకుడు తలుపు తట్టగా లోపల ఎలాంటి స్పందన రాకపోవడంతో బయటపడిన ఆ మర్మకథ అప్పుడు దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడీ మియాపూర్ ఘటన వెనక ఉన్న నిజం ఏమిటి? కుటుంబం ఒకేసారి ప్రాణాలు తీసుకున్నదా? లేక మరెవరైనా ఈ నేరాన్ని దాచిపెట్టారా? పోలీసుల దర్యాప్తుతోనే ఆ ఇంటి నిశ్శబ్దం వెనక దాగిన రహస్యాలు వెలుగులోకి రానున్నాయి.
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మరణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అందులో భాగంగా ఆ ఇంటి పరిసరాల్లోని వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే పసి కందును చంపేసి అనంతరం ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పసి కందును హత్య చేసి.. అనంతరం వారంతా విషయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత ఈ కేసులో ఒక స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలోని వారంతా ఆత్మహత్య చేసుకోవడంతో.. స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక మృతుల వివరాలు.. లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అల్లుడు అనిల్ (40), కవిత (38)తోపాటు అనిల్, కవితల కుమార్తె అప్పు (2).
మరో వైపు మియాపూర్ సమీపంలోని చందానగర్‌లో స్థానిక నాలాలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సదరు మహిళ మృతదేహంపై నర్సమ్మ అనే పచ్చబొట్టు ఉంది. అలాగే ఆమె వద్ద ఒక పర్సు ఉందని.. అందులో కమ్మలు, బ్రాస్లెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని వారు స్వాధీనం చేసుకున్నారు.