సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ మాజీ ఎంపీ, కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి (83) హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి కన్నుమూశారు. వయోభారానికి తోడు శ్వాస తీసుకోవడంలో పలు ఇబ్బందులు తలెత్తగా, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
హైదరాబాద్ మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య డాక్టర్ బీవీ విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన సుధాకర్ రెడ్డి, మూడు దఫాలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేతగా రికార్డు సాధించారు. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు కాగా, గోల్కొండ కవుల సంచికను స్థాపించిన సురవరం ప్రతాపరెడ్డి ఆయన పెదనాన్న.
సుధాకర్ రెడ్డి సొంతూరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. ఆయన తన అమ్మమ్మగారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు. చదువు కోసం కర్నూలు వెళ్లారు. 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు, పుస్తకాలు కావాలంటూ జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు భావజాలం ఎంతగానో ఆకర్షించింది.
1960లో ఏఐఎస్‌ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.1962లో వెంకటేశ్వర యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజులపాటు సమ్మెకు నాయకత్వం వహించారు.1964లో కర్నూలులో బీఏ చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.1967లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. తర్వాత హైదరాబాద్ న్యాయ కళాశాలలో చేరిన వారంలోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. ఆ ఎన్నికల అనంతరం ఆయన ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర బాధ్యతలను స్వీకరించారు.1970లో సుధాకర్ రెడ్డి ఏఐఎస్‌ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.1974 నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.1994లో కర్నూలులోని డోన్‌లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు.
పార్లమెంట్ మెంబర్‌గా :1988లో నల్గొండ ఎంపీగా విజయం సాధించి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2000లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియామకమయ్యారు.
2000 సంవత్సరంలో నాటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక భూమిక పోషించారు.2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచే రెండోసారి విజయం సాధించారు.2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన సీపీఐ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా నియామకం. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జులై 24న స్వయంగా తప్పుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సుధాకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సీపీఐ పార్టీ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణలోని వెనుకబాటుతనాన్ని రూపుమాపవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి సీపీఐ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి : సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, సురవరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని ఆయన సేవలను స్మరించుకున్నారు.
కేసీఆర్ సంతాపం : సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పీడితవర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో విశేషంగా పనిచేశారని ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని ఆదివారం (ఆగస్టు 24) ఉదయం పది గంటలకు హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారు. కార్యకర్తల సందర్శన తర్వాత గాంధీ మెడికల్ కళాశాలకు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు అందజేస్తారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గొప్ప నాయకుడిని కోల్పోయింది…వామపక్ష ఉద్యమం మరో వేగుచుక్కను కోల్పోయింది.. మరో అరుణ తార అస్తమించింది.. తెలుగు గడ్డపై పుట్టి జాతీయ రాజకీయాల్లో రాణించిన నాయకుడు ఇక చాలని ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. నిరుడు సీపీఐ(ఎం- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కి‍్సస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి మరణం.. ఇప్పుడు ఈ నాయకుడి మృతితో వామపక్ష రాజకీయాల్లో తెలుగువారి ప్రాతినిధ్యం తగ్గినట్లయింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఒకప్పుడు కరువుకు మారు పేరు. అలాంటి జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించారు సురవరం సుధాకర్‌రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన, గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాప్‌రెడ్డికి సమీప బంధువు. 83 ఏళ్ల సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జాతీయ పార్టీ అయిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుధాకర్‌రెడ్డి.. 1942లో పుట్టారు. సమీపంలోని కర్నూలులో చదువుకున్నారు. 1964లో ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, 1967లో ఓయూలో ఎల్‌ఎల్‌బీ చదివారు.
సురవరం సుధాకర్‌రెడ్డి పుట్టింది పాలమూరులో అయినా.. రాజకీయ ప్రస్థానం నల‍్లగొండ నుంచి సాగింది. 1998, 2004 ఎన్నికల్లో రెండుసార్లు నల్లగొండ ఎంపీగా గెలుపొందారు సుధాకర్‌రెడ్డి. సీపీఐ 2004-09 మధ్య యూపీఏ ప్రభుత్వానికి కీలక మద్దతుదారు. 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సురవరం ఏడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2019లో వైదొలగారు.
వామపక్ష వాదానికి ప్రభావితుడైన సురవరం.. 15 ఏళ్ల వయసులోనే ఉద్యమించారు. కర్నూలులో తాను చదువుతున్న పాఠశాలల్లో నల్లబోర్డులు, చాక్ పీస్‌ల, పుస్తకాలు కావాలని తోటి విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఉద్యమం కర్నూలు జిల్లా అంతా వ్యాపించింది. సుధాకర్‌రెడ్డి ఇదే స్ఫూర్తితో విద్యార్థి రాజకీయాలు, వామపక్ష రాజకీయాల్లో కొనసాగించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
కరుడుగట్టిన కమ్యూనిస్టు అంటే ఎలా ఉంటారో సురవరం సుధాకర్‌రెడ్డిని చూసి తెలుసుకోవచ్చు. 83 ఏళ్ల వయసులో ఆరోగ్యం అసలు బాగోలేకున్నా.. ఇటీవల ఆయన ఖమ్మంలో జరిగిన పార్టీ మహాసభల్లో పాల్గొన్నారు. తద్వారా పార్టీ పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు.