ఐపిఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు – సుప్రీం కీలక ఆదేశం
ఏపీ సీబీసీఐడీ మాజీ చీఫ్ ఐపిఎస్ అధికారి సంజయ్ కి మంజూరైన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మూడు వారాల్లో లొంగిపోవాలని సంజయ్‌కు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.ఇప్పటికే 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పును హైకోర్టు ఇచ్చిన అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ సమయంలోనే ఏపీ హైకోర్టు మొత్తం కేసు విచారణ చేసినట్లుగా ఉంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో సంజయ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్న కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఆ తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనను ASG ఎస్.వీ. రాజు వినిపించారు. అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నా హైకోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఆయన వాదించారు.సుప్రీం ధర్మాసనం కూడా ఈ విషయంలో ఏకీభవించింది. విచారణ అనంతరం సంజయ్ కు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ, తాను మూడు వారాల్లో విచారణ అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.