కొన్ని కథలు వింటే జీవితం ఎంత కఠినంగా ఉంటుందో అనిపిస్తుంది. బయోపిక్‌లను మించిన ఎమోషన్ ఆ జీవితంలో కనిపిస్తుంది. అలాంటి ఒక జీవితం ఇది. గ్రీక్ గాడ్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హృతిక్ రోషన్ సోదరి, ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె అయిన సునైనా రోషన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చాలా విషయాలు ఆశ్చర్యపరుస్తాయి.
రెండు సార్లు బ్రేకప్ అయిన సునైన, మూడో సారి ప్రేమలో విఫలమైంది. ఆ బ్రేకప్ కథలు ఆశ్చర్యపరుస్తాయి.సునైనా 1992లో ఆశిష్ సోనీని వివాహం చేసుకుంది. వారి వివాహం విడాకులతో ముగియడానికి ముందు, ఈ దంపతులకు సురానికా సోనీ అనే కుమార్తె జన్మించింది. చాలా సంవత్సరాల తర్వాత సునైనా 2009లో మోహన్ నగర్‌ను రెండవ వివాహం చేసుకుంది. కానీ ఆ సంబంధం కూడా కొన్ని సంవత్సరాలలోనే ముగిసింది. తన రెండవ విడాకుల తర్వాత, సునైనా జర్నలిస్ట్ రుహైల్ అమీన్‌తో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. వారి సంబంధం మీడియా దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఉందని కథనాలొచ్చాయి. అయితే రుహైల్ తర్వాత ఈ వాదనలలో కొన్నింటిని ఖండించాక చివరికి వారి సంబంధం ముగిసిందని ధృవీకరించారు.
హృతిక్ రోషన్ సోదరి సునైన తనకు పరిచయమైన ఒక ముస్లిమ్ యువకుడు రుహైల్ ని ప్రేమించి పెళ్లాడతానని ఇంట్లో పట్టుబట్టగా, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు వ్యతిరేకించడంతో సునైన వారితో గొడవకు దిగిందని మీడియాలో కథనాలొచ్చాయి. ముస్లిమ్ తో ప్రేమలో ఉన్న తనను తల్లిదండ్రులు కొట్టారని తిట్టారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది సునైన.
ఇక తన వ్యక్తిగత జీవితంలో కలతలు అనారోగ్య కారణాలతో డిప్రెషన్ కి గురైన సునైన తాగుడుకు అలవాటు పడింది. సునైన ఓ ఇంటర్వ్యూలో తన తాగుడు అలవాటు గురించి, అనారోగ్య సమస్యల గురించి బహిరంగంగా చెప్పుకొచ్చింది. తాను క్షయ- క్యాన్సర్ లాంటి ప్రమాదకర రుగ్మతలతో ఏకకాలంలో పోరాడానని దాని కారణంగా బాగా తాగుడుకు అలవాటు పడిపోయానని సునైనా రోషన్ చెప్పింది. తాగుడు అనే చక్రంలో పడి దాని నుంచి బయటపడలేకపోయానని తెలిపింది. చివరికి తనను విదేశాలలోని పునరావాస కేంద్రానికి పంపాల్సిందిగా తనే స్వయంగా తల్లిదండ్రులను కోరినట్టు వెల్లడించింది. భారతదేశంలో అయితే లంచగొండులు .. డబ్బు ఇస్తే మళ్లీ మందు బాటిల్ తెచ్చి ఇస్తారు. అందుకే విదేశాలకు పంపాల్సిందిగా కోరినట్టు తెలిపింది.
అయితే తనను ఒక గదిలో బంధించి కౌన్సిలర్లు ప్రశ్నలతో విసిగించారని, 28 రోజులు తనకు నిద్ర అన్నదే పట్టలేదని సునైనా తెలిపింది. కౌన్సిలింగ్ – చికిత్స సమయంలో తన శరీరం నుంచి అన్ని వ్యర్థాలను తొలగించారని వెల్లడించింది. చివరికి పోరాడి అనుకున్నదానిని సాధించుకున్నాను. తాగుడు అనే రోగం నుంచి బయటపడ్డాను అని తెలిపింది. తాగుడు మానే దశలో తీవ్ర ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు తలెత్తుతాయని కూడా స్వీయానుభవంతో సునైనా వెల్లడించింది. అలాగే తాను పాఠశాలకు వెళ్లడాన్ని అసహ్యించుకున్నానని, కానీ వాస్తవ జీవితంలో సిసలైన పాఠాలు నేర్చుకున్ననని కూడా స్పష్ఠంగా చెప్పుకొచ్చింది. తన స్కూల్ డేస్ లో తాను సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చానని స్పెషల్ ట్రీట్ ఏదీ లేదని, అప్పటికి తన తండ్రి వద్ద ఏదీ లేదని, నటుడిగా కానీ, నిర్మాతగా కానీ ఆయన అంతగా రాణించలేదని కూడా సునైనా తెలిపింది. ఎవరూ మమ్మల్ని స్టార్ పిల్లలుగా చూడలేదని వెల్లడించింది. కానీ ఆ పాఠశాల తనకు జైలులా అనిపించిందని అన్నారు. అసహ్యించుకున్నాను.. పాఠాలు చదవడంలో విఫలమయ్యానని తెలిపింది.









