ఎలాంటి సినిమా అయినా సరే అది ఆడియన్స్ ను మెప్పించాలంటే దానికి ముందుగా కావాల్సింది మంచి కథ. ఆ కథ బావుంటే సినిమాలు హిట్లుగా నిలుస్తాయి. కథ బాలేకపోతే సినిమాలు ఆడవు. హిట్ సినిమాలో కథ అంత కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే రైటర్లు, డైరెక్టర్లు కథ విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచించి మరీ ఫైనల్ చేసి సెట్స్ కు వెళ్తారు.
కథ సరిగా లేనప్పుడు ఆ సినిమా కోసం ఎంత కష్టం పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఎప్పుడైనా కథ విషయంలో ఆచితూచి వ్యవహరించి, ఏమైనా డౌట్స్ ఉంటే తెలిసిన వారి నుంచి కొన్ని ఇన్ పుట్స్ తీసుకుని దాన్ని డెవలప్ చేసుకోవడమో లేకపోతే కొన్ని సలహాలు, సూచనల మేరకు కథను మార్చడం లాంటివో చేస్తుంటారు.
డిజాస్టర్ గా నిలిచిన మాస్ జాతర
అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు. మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ఈ సినిమా అయినా సక్సెస్ ను ఇస్తుందేమో అనుకుంటే ఇది కూడా ఫ్లాప్ గా మిగిలింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. సితార బ్యానర్ అంటే త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటిది.
ఆ బ్యానర్ లో వచ్చే ప్రతీ సినిమాకీ త్రివిక్రమ్ సలహాలు, సూచనలు ఉండనే ఉంటాయి. సితార బ్యానర్ లో వచ్చే ప్రతీ సినిమా కథ త్రివిక్రమ్ విని తనకు తోచిన మార్పులు చేర్పులు చెప్పడమే కాకుండా సినిమాకు మొదటి ఆడియన్ గా ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే ఆయనే చూసి అవసరమైతే కొన్ని సూచనలు కూడా ఇస్తారు. సితార సంస్థలో వచ్చే అన్ని సినిమాల్లాగానే త్రివిక్రమ్ మాస్ జాతరకు కూడా కొన్ని సూచనలు చేశారట. సముద్రఖని క్యారెక్టర్ ను జోడించడంతో పాటూ ఓ కామెడీ ట్రాక్ ను కూడా పెట్టమని సూచించారని సమాచారం. అయితే ఎన్ని మార్పులు చేసినా సినిమాలో అసలు కథ లేనప్పుడు అవన్నీ ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పిస్తాయనేది ఇక్కడ అసలు పాయింట్. దీన్ని బట్టి త్రివిక్రమ్ కూడా కథల విషయంలో కాస్త ఆలోచించాల్సిన అవసరముందని తెలుస్తోంది.


















