పహల్గాంలోకి చొరబడిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడున్న పర్యాటకుల మతం అడిగి, కన్ ఫాం చేసుకుని మరీ హిందువులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారతదేశ ఆడపడుచుల నుదిటిన సిందూరం చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అందుకు ప్రతికారంగా “ఆపరేషన్ సిందూర్” చేపట్టింది. ఇదే క్రమంలో.. ఇప్పుడు బంగ్లాలోని హిందువులను లక్ష్యంగా చేసుకుని మారణహోమం జరుగుతున్న నేపథ్యంలో “ఆపరేషన్ సిందూర్ -2” డిమాండ్ తెరపైకి వచ్చింది.
బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల పాతికేళ్ల హిందూ వ్యక్తి దిపూ చంద్ర దాస్ పై దాడి చేసిన మూక.. అత్యంత కిరాతకంగా అతడిని హత మార్చింది. దీన్ని భారతదేశం మొత్తం ఖండించింది. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులపై దాడుల ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ – 2 డిమాండ్ తెరపైకి వచ్చింది.
అవును… తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న హిందూ వ్యతిరేక చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఘటనలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ కార్యాలయం వద్దకు విశ్వ హిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన చేపట్టారు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఆందోళనల్లో బజరంగ్ దళ్ కూడా భాగమైంది. ఈ సమయంలో వీరంతా కలిసి ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీ వద్ద నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలను ముందుగానే అంచనా వేయడంతో పోలీసులతో పాటు పారామిలటరీ కలిపి సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని ముందుగానే రంగంలోకి దింపారు. మూడు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన నిరసనకారుల్లో ఒకరు… ఒక హిందూ వ్యక్తిపై దారుణంగా దాడి చేసి చంపారని.. హత్య వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము తమ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని.. బంగ్లాదేశ్ పోలీసులు కూడా హత్య వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము నిరసన తెలుపుతున్నామని అన్నారు. “ఈ రోజు మనం గొంతు ఎత్తకపోతే రేపు నేను దీపు అవుతాను.. నువ్వు కూడా దీపు అవుతావు” అంటూ మరో నిరసనకారుడు అన్నారు.
ఇదే సమయంలో.. దీపూ చంద్ర దాస్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది నిరసనకారులు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిసూ నినాదాలు చేశారు. అదేవిధంగా.. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను నిరసనకారులు దహనం చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ పై ఆపరేషన్ సిందూర్ – 2 చేపట్టాలని వీ.హెచ్.పీ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి! దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది!
ఈ నిరసనలను బంగ్లాదేశ్ ఖండించింది. దౌత్య సంస్థలపై ముందస్తుగా ఉద్దేశించిన హింస, బెదిరింపు చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇది దౌత్య సిబ్బంది భద్రతకు హాని కలిగించడమే కాకుండా.. పరస్పర గౌరవం, శాంతి, సహనానికి సంబంధించిన విలువలను కూడా దెబ్బతీస్తుందని ఢాకాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదే సమయంలో.. ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిరోధించాలని.. అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని.. భారత్ లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలు, సంబంధిత సౌకర్యాల భద్రతను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది.
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక మాటలు, చేష్టలు పెరుగుతున్న నేపథ్యంలో.. పైగా వచ్చే ఏడాది ఆ దేశంలో జరగనున్న ఎన్నికల్లో భారత్ ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు సందేహ పడుతున్నారని అంటున్న తరుణంలో.. భారత్ – బంగ్లాదేశ్ మధ్య మంటల్లో చలి కాచుకోవాలని.. బంగ్లాదేశ్ కు ఇంధనం అందించాలని.. ఈ గ్యాప్ లో భారత్ పై తమ అక్కసు తీర్చుకోవాలని పాక్ ఉత్సాహంగా ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది!
అవును… ఈ ఏడాది సెప్టెంబర్ లో సౌదీ అరేబియా అణ్వాయుధ పాకిస్థాన్ తో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (ఎస్ఎండీఏ)పై సంతకం చేసింది. ఇందులో ప్రధానంగా పేర్కొన్న అంశం.. ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపైనా జరిగిన దాడిగా పరిగణించబడుతుంది అని.. ఇది ఆసక్తిగా మారడంతో పాటు.. భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ వ్యూహాత్మక అడుగుగా చెబుతున్నారు. మే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బ ఎఫెక్ట్ ఇది అని అంటుంటారు.
ఈ ఒప్పందంలో.. ఉమ్మడి సైనిక విన్యాసాలు, నిఘా సమాచారం పంచుకోవడం, శాశ్వత సైనిక సమన్వయం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో.. భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ తోనూ ఇలాంటి రక్షణ ఒప్పందం చేసుకోవడంపై పాకిస్థాన్ దృష్టి సారించిందని.. అందుకు యూనస్ కూడా సానుకూలంగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఎన్నికలకంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజా నివేదికల ప్రకారం… పాకిస్థాన్ లోని అనేకమంది అగ్ర రక్షణ అధికారులు బంగ్లాదేశ్ ను వరుసగా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ పర్సన్, నేవీ చీఫ్ నుండి.. ఐఎస్ఐ అధిపతి జనరల్ అసిమ్ మాలిక్ వరకు.. ముహమ్మద్ యూనస్ ను కలవడానికి ఢాకాకు చేరుకుంటున్నారు. భారత్ తో ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియాతో పాక్ చేసుకున్నట్లుగానే ఓ రక్షణ ఒప్పందం ఇస్లామాబాద్ – ఢాకా మధ్య జరగలాని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
ఈ ఒప్పందంపై ఇరు దేశాలూ సంతకాలు చేస్తే… బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇకపై అధికారికంగా నిఘా సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభించడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే.. ఈ ఒప్పందంలో అణు సహకారం ఉంటుందా లేదా అనేది అత్యంత కీలకంగా మారింది. ఒక వేళ అదే జరిగితే… అది కచ్చితంగా భారత్ కు ఆందోళన కలిగించే అంశం అవుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నిషేధించబడింది. దీంతో.. తీవ్రవాద జమతే-ఇ-ఇస్లామీ, ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఐఎస్ఐ కు తొత్తుగా ప్రసిద్ధి చెందిన జమాతే కాకుండా.. ఢిల్లీకి ఉన్నంతలో అనుకూలంగా ఉన్న బీ.ఎన్.పీ అధికారంలోకి వస్తుందని భారత్ ఆశిస్తోందని అంటున్నారు. అదే జరిగితే.. పాకిస్థాన్ – బంగ్లాదేశ్ మధ్య రక్షణ ఒప్పందం నిలిచిపోవచ్చని చెబుతున్నారు.
కాగా… 1971లో బంగ్లాదేశ్ విముక్తికి ముందు ఇదే పాకిస్థాన్ సాయుధ దళాలు జాతి నిర్మూలన చేసి, లక్షలాది మంది బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. నాడు భారత్ పుణ్యామాని బంగ్లాదేశ్ కు విముక్తి దక్కింది. విచిత్రంగా.. ఇప్పుడు అదే పాకిస్థాన్ తో జతకడుతూ, భారత్ కు వ్యతిరేక ఆలోచనలు చేస్తుంది బంగ్లాదేశ్!
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అక్కడున్న హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో రోజు రోజుకీ భారత వ్యతిరేక వాక్ చాతుర్యం పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల్లోనూ ఉద్రిక్తతలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయనే చర్చ మొదలైందని అంటున్నారు. మరోవైపు ఇదే అదనుగా భారత్ – బంగ్లా మధ్య శాశ్వత శత్రుగోడ కట్టాలని పాక్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
అవును… భారత్ – పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు పెరుగుతున్నాయని.. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ రాజకీయ సలహాదారు డాక్టర్ ముహమ్మద్ యూనస్ మద్దతుతో బంగ్లాదేశ్ తో సైనిక ఒప్పందం చేసుకునే దిశగా పాక్ పావులు కదుపుతుందని అంటున్నారు. మరోవైపు బంగ్లాపై ఈగ వాలినా ఊరుకోమని అద్దె ప్రగల్భాలు పలుకుతున్నారు పాక్ నేతలు.
దీంతో… ఏక్షణమైనా.. ఏమైనా జరగొచ్చా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి ఓ పాజిటివ్ స్టేట్ మెంట్ వచ్చింది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ తో సంబంధాలు చేదుగా మార్చే ఉద్దేశ్యం లేదని.. బదులుగా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంతో పాటు.. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంపై దృష్టి సారించిందని తాత్కాలిక ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ అన్నారు.
ఓ పక్క నిరసనలు, వీసా సేవల రద్దు, ఇరు దేశాల దౌత్య కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు వెరసి.. ఇరూ దేశాల మధ్య సంబంధాలను కొత్త అత్యల్ప స్థాయికి నెట్టే ప్రమాదం ఉన్నప్పటికీ.. సయోధ్యను లక్ష్యంగా చేసుకుని ఆ వైపు నుంచి వచ్చిన మొదటి మాటలుగా ఇవి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు పతనమవుతున్న సమయంలో.. ఆర్థిక సలహాదారు అహ్మద్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు పాక్ కు షాకింగ్ గా మారాయని అంటున్నారు.
అందుకు కారణం అహ్మద్ మాటల్లో జోడించిన మరో ఓ కీలక స్టేట్ మెంట్. ఇందులో భాగంగా… భారతదేశంతో సంబంధాలను రెచ్చగొట్టడానికి లేదా దెబ్బతీయడానికి మూడవ పక్షాలు చేసే ఎలాంటి ప్రయత్నాలలోనూ ఈ తాత్కాలిక పరిపాలన పాల్గొనదని అహ్మద్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పాక్ గొంతులో పచ్చి వెలక్కాయను వేసినట్లున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
ఇదే క్రమంలో… భారతదేశం నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించిందని ధృవీకరించిన అహ్మద్… ఈ చర్య ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దశగా అభివర్ణించారు. భారత్ నుంచి తమకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునే విషయంలో ఎటువంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో.. ఇది కచ్చితంగా పాక్ కు బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు!

















