సోషల్ మీడియాతో జగన్ కు ఏమైనా లాభం చేకూరుతోందా? ముఖ్యంగా ఎక్స్ ఖాతా ద్వారా ఆయనకు ఏదైనా ప్రయోజనం వస్తుందా.. అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా ఖాతాలు కేవలం 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే చేరువవుతాయి. పైగా నెటిజన్లు మాత్రమే సోషల్ మీడియాను ఫాలో అవుతారు. వీరిలోను ఎక్కువ మంది మేధావులు, చదువుకున్న వారే ఉంటున్నారు. వీరికి రాజకీయంగా పరిజ్ఞానం ఉంటుంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం గతంలో ఏం జరిగింది.. ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది కూడా వీరికి బాగా అవగాహన ఉంది.
ఈ నేపథ్యంలో జగన్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న కామెంట్లు లేదా వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపించడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మాస్ ఇమేజ్ ఉన్న జగన్ జనంలోకి వస్తే ఉండే రియాక్షన్ గాని స్పందన గాని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు రావడం లేదన్నది వాస్తవం. గత 15 మాసాలుగా జగన్ కేవలం సోషల్ మీడియాకి మాత్రమే మెజారిటీగా సమయం కేటాయిస్తున్నారు. మరి ప్రజల్లోకి రావడం ఆయనకి ఇష్టం లేక అలా చేస్తున్నారా లేకపోతే ఇంకా సమయం ఉందని భావిస్తున్నారో తెలియదు గాని కేవలం ఎక్స్ ఖాతాలో కామెంట్లు చేయటం, సుదీర్ఘ వ్యాసాలు రాయటం వంటివి చేస్తున్నారు.
దీనివల్ల అనుకున్న ఇమేజ్ అయితే రావడం లేదు. మెజారిటీ ప్రజలకు కూడా ఇవి చేరడం లేదు. కీలకమైన పి పిపీ విధానం పై జగన్ సుమారు పది పదిహేను స్వీట్లు చేశారు. కానీ ఇవన్నీ సుదీర్ఘంగా ఉండడం విశ్లేషణ చేస్తున్నట్టుగా అనిపించడం నేపథ్యంలో ఇది పెద్దగా ప్రజల్లోకి చేరలేదు. నిజానికి ఎక్స్ ఖాతాలో పెట్టే కామెంట్లు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. స్పష్టంగా ఉండాలి .చిన్నవిగా కూడా ఉండాలి. కానీ సుదీర్ఘ వ్యాసాలు రాస్తున్న క్రమంలో జగన్ ఏం చెబుతున్నారన్నది మేధావులకు సైతం అంత చెక్కని విషయంగా మారింది. ఇక సామాన్య ప్రజలకు చేరడం అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కూడా సుమారు ఏడుఎనిమిది సార్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది కూడా ప్రజలకు చేరువు కాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా తనకు ఏదో మేలు చేస్తుంది.. అని జగన్ భావిస్తూ ఇంటికే పరిమితం అయినప్పటికీ అది అనుకున్న ప్రయోజనం చేకూర్చకపోగా ప్రజలకు చేరని విధంగా మారింది అన్నది వాస్తవం. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే జగన్ నేరుగా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఆయన నర్సీపట్నంలో పర్యటించినప్పుడు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. ఆయనకు హారతులు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితి ముందు ముందు కూడా కొనసాగితే జగన్కు కొంతమేరకు మేలు జరుగుతుందనేది వాస్తవం. లేకపోతే కేవలం జగన్ ఎక్స్‌కే పరిమితం అయితే అది మేధావుల వరకు చేరినా వారు ఎలాగూ జగన్ గత పాలనను విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పినా చెవికి ఎక్కించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఎలా చూసుకున్నా సోషల్ మీడియా వల్ల జగన్కు వచ్చిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంది.