రాష్ట్రంలో సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్ సహా ఇతర మద్యమాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, అదేవిధంగా వ్యాఖ్యానాలు రావడం, ట్రోలింగ్స్ వీడియోలు వంటివి తీవ్ర స్థాయిలో జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా స్పందిస్తున్నారు. ఆయా వార్తలను, కధనాలను, వ్యాఖ్యలను కూడా వారు తప్పుపడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు అయితే మంత్రులను పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇట్లాంటి విమర్శలను ఇట్లాంటి వ్యాఖ్యలను కచ్చితంగా ఖండించాలని కోరుతున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కానీ వ్యాఖ్యలు కానీ ఎక్కడ ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఇటీవల వైద్య కళాశాల పి పిపి విధానం పై తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి. విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్స్ కూడా పెరిగిపోయాయి. అదేవిధంగా కర్నూల్ లో రైతుల సమస్యలు… ముఖ్యంగా ఉల్లిపాయల సమస్యలు మరింత జోరుగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికి ముందు అనేక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
ఇక తరచుగా సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యాఖ్యానాలు, వ్యంగ్యాస్త్రాలకు చోటు ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఇక మాటల ద్వారా కట్టడం చేయలేమని భావిస్తున్న ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసే విధంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇది అంత సాధ్యమయ్యే విషయమేనా అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే సోషల్ మీడియా అనేది రాష్ట్రాల పరిధిలో లేనటువంటి కీలక అంశం. ఇది ఐటీ చట్టం కిందకు వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఐటీ చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వ్యవస్థ. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలు తీసుకువచ్చింది. పలు నిబంధనలు కూడా విధించింది. అయితే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సోషల్ మీడియాను భావ ప్రకటన స్వేచ్ఛగా ప్రకటించిన దరిమిలా ఆయా నిబంధనలు, ఆయా చట్టాలలో కూడా మార్పులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అనేక ఉత్తర్వులు కేంద్రం నుంచి అందాయి.
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేయడానికి వీలులేదని ఇటీవల సుప్రీంకోర్టు సహా బాంబే హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఇన్ని చట్టాలు, ఇన్ని నిబంధనలు, ఇన్ని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశగా దీనికి చట్టం చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ రేపిది చట్టం చేసిన దీన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రం పరిధిలోని అంశంపై చట్టం చేసేటప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. గతంలో దిశా చట్టం చేసినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.
కాబట్టి కూటమి చట్టం తీసుకురావడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఈ చట్టానికి అనుమతి లభించే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే మరో దిశ చట్టం మాదిరిగా ఇది కూడా మూలన పడే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.