రాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనాల మైండ్ సెట్ మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఓటర్ల ఆలోచనలు వారి నిర్ణయాత్మకమైన తీర్పులను చూస్తే కనుక చాలా విషయాలు బోధపడతాయి. పెద్దగా అక్షరాస్యత కానీ టెక్నాలజీ కానీ మీడియా సాధనాలు కానీ లేని రోజులలోనే ఐరన్ లేడీ ఇందిరా గాంధీని 1977లో జనాలు ఓడించారు అన్నది అంతా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున సోషల్ మీడియా ప్రభంజనం ఉంది. దాదాపుగా అందరూ ఒక మాదిరి అక్షరాస్యులే. మిగిలినది సోషల్ మీడియా నేర్పిస్తోంది. అందువల్ల ఎన్నిక ఎన్నికకూ రాజకీయ పార్టీలకు ఎంతో కష్టమైన సవాళ్ళు ఎదురవుతున్నాయని చెప్పాల్సి ఉంది.
గెలుపు ఓటములు అన్నవి గ్రౌండ్ లెవెల్ లోనే అంతా ఆధారపడి ఉన్నాయని చెప్పాల్సి ఉంది. ఈ రోజున చూస్తే ఎమ్మెల్యేలు సామంతరాజులు మాదిరిగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా అంతకంటే లేదు. ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాలలో అయిదేళ్ళ పాటు యధేచ్చగా వ్యవహరిస్తున్నారు. వారి చెప్పినదే శాసనంగా మారుతోంది. ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వంలో అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేల మీద అయితే జనాల నుంచి విమర్శలు ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. వారు తమ కోసమే పని చేసుకుంటున్నారు అని విపరీతమైన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.
ఇక దేశంలో చాలా కాలంగా సెంట్రిక్ పాలిటిక్స్ సాగుతూ వచ్చాయి. అంటే వ్యక్తి కేంద్రంగా అని చెప్పాలి. ఎవరు పార్టీ అధినేతలు ఉంటారో ఎవరు ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తారో వారి ఇమేజ్ చూసి ఓట్లేసేవారు. అలా తమ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది కూడా చూడకుండా గెలిపించేసేవారు. అలా ఇందిరమ్మ, ఎన్టీఆర్, వాజ్ పేయ్, నుంచి మోడీ దాకా కొంత వరకూ హవా సాగింది. ఇక తెలుగు నాట చూస్తే చంద్రబాబు, వైఎస్సార్ కేసీఆర్, జగన్ ఇలా అధినాయకుల బొమ్మలను చూసి ఓట్లు పడేవి. కానీ రానూ రానూ సోషల్ మీడియా టెక్నాలజీ ప్రభావంతో పాలిటిక్స్ లో భారీ మార్పు వస్తోంది. ఓటరు ఫోకస్ ఇపుడు లోకల్ మీడ పడుతోంది. దానికి కారణం తమ ఏరియాల్లో ఏమి జరుగుతోందో వారికి క్షణాలలో తెలిసిపోవడమే.
ఇక మోడీ ఎంతలా ప్రచారం చేసినా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ 2023 ఎన్నికల్లో గెలవలేకపోయింది. దానికి కారణం లోకల్ పాలిటిక్స్ ని జనాలు చూసి ఓడించారు. ఇక తెలంగాణలో రెండు సార్లు కేసీఆర్ ఇమేజ్ వర్కౌట్ అయి గెలిచిన బీఆర్ఎస్ 2023లో ఓటమి పాలు అయింది. అలాగే 2024లో జగన్ తన బొమ్మతోనే అంతా గెలిచారు అని వంద మంది ఎమ్మెల్యేల దాకా అటూ ఇటూ మార్చేసి ప్రయోగం చేస్తే జనాలు లోకల్ గా ఓడించేసారు. జగన్ సంక్షేమ పధకాలు కానీ ఆయన ఇమేజ్ కానీ ఏ మాత్రం పనిచేయలేదు అన్నది ఈ ఎన్నిక నిరూపించింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఢిల్లీలో ఓడినా యూపీలో బీజేపీ 2024 ఎన్నికల్లో అతి తక్కువ ఎంపీ సీట్లు గెలిచినా అక్కడ కూడా యోగీ మోడీ ఇమేజ్ పనిచేయలేదని అర్ధం అవుతోంది.
ఇక ఏపీలో చూస్తే గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ కూటమి పెద్దలు గ్రహించాలని అంటున్నారుఇ. చంద్రబాబు పాలనను ఎవరూ తప్పు పట్టడం లేదు. ఆయన బాగానే పాలిస్తున్నారు. ఆర్థిక భారం ఉన్నా సంక్షేమ పధకాలను కూడా ఇస్తున్నారు. అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అలాగే పవన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రజలకు చేయలన్న తపనను కూడా జనాలు గమనిస్తున్నారు. కానీ కూటమి పార్టీల ఎమ్మెల్యేల తీరే చర్చకు వస్తోంది. వారిని కనుక కట్టడి చేయకపోతే జనాలు ఇచ్చే తీర్పు వేరేగా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఇపుడు లోకల్ గానే అంతా చూసి తీర్పు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సంక్షేమ పధకాలు ఇస్తారు, ఇక ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి జరుగుతుంది అన్నది జనాలు అంటున్నారు. అందువల్ల తమకు ఎమ్మెల్యేలు ఎంత మేరకు అందుబాటులో ఉన్నారు, తమ ప్రయోజనాలకు ఏ మేరకు కాపాడుతున్నారు అని చూస్తూనే విచ్చలవిడిగా చేసే అవినీతిని కానీ దందాలను కానీ ఏ మాత్రం స్పేర్ చేయడం లేదు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీలు గ్రౌండ్ లెవెల్ లోనే అన్నీ చూసుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే అని అంటున్నారు.