ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులను మార్పు చేసింది. ఒక సుదీర్ఘమైన కసరత్తు దీని వెనక జరిగింది. ఆ మీదట రేషన్ కార్డు అంటే ఒక గర్వం గౌరవం కలిగే విధంగా డిజిటల్ కార్డుగా రూపకల్పన చేసింది. ఏ డెబిట్ క్రెడిట్ కార్డులకు తీసిపోని విధంగా దానిని డిజైన్ చేసింది. జేబులో పట్టే విధంగా ఉంటూ ఎంతో స్మార్ట్ గా ఉండే ఈ కార్డులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఏపీలోని రేషన్ కార్డు ఇక మీదట దేశంలో ఎక్కడ అయినా చెల్లుతుంది. దానిని ఆ విధంగా వినియోగించుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు సైతం అక్కడే ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు. క్యూ ఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే చాలు మొత్తం వివరాలు అన్నీ వస్తాయి. ఈ రేషన్ కార్డుతో స్కాం చేస్తే ఆ కార్డుదారుడు రేషన్ తీసుకున్న వివరాలు అన్నీ వస్తాయి. అవి ఏకంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డేటా బేస్ లోకి నమోదు అవుతాయి.
స్మార్ట్ కార్డు డిజిటల్ రూపంలో ఉన్నందువల్ల మాల్ ప్రాక్టీస్ కి చాన్స్ లేదు. సదరు కార్డుదారులు ఉపయోగించి తాను రేషన్ తీసుకున్నట్లుగా స్కాన్ చేస్తేనే తప్ప వేరే విధంగా జరగదు. అలా డిజిటల్ సంతకంగా ఈ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు రానున్న రోజులలో రేషన్ దుకాణాల రూపు రేఖలను మార్చాలని ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. జనతా బజార్లుగా వాటిని మార్చడం ద్వారా మధ్యతరగతి వర్గాలు పేదలు అంతా కూడా తమకు అవసరమైన నిత్యావసరాలు అన్నీ కొనుగోలు చేసుకునే విధంగా మారుస్తారు అని అంటున్నారు.
దేశంలో అతి పెద్ద సంఖ్యలోనే ఏపీలో రేషన్ కార్డుదారులు ఉన్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా స్మార్ట్ కార్డులను ఒక కోటీ యాభై లక్షల కుటుంబాలను పొందు పరుస్తూ రూపొందించారు. ఈ లెక్కన నాలుగు కోట్ల మంది దాకా ప్రజలు రేషన్ కార్డు ద్వారా మెంబర్స్ గా ఉంటున్నారు. ఈ డేటా అంతా పౌర సరఫరాల శాఖ వద్ద ఉంటుంది. ఏపీలో మొత్తం 5 కోట్ల దాకా జనాభా ఉంటే అందులో నాలుగు కోట్ల మంది దాకా రేషన్ కార్డుదారులే ఉంటారు అన్న మాట. ఇదిలా ఉంటే కొత్తగా మరో తొమ్మిది లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చారు అని చెబుతున్నారు.
ఏపీలో ఆగస్టు 25 నుంచి ప్రారంభించి ఆగస్టు 31 దాకా రాష్ట్రవ్యాప్తంగా ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు అని చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకుని స్మార్టు కార్డుల పంపిణీ మొదలవుతుంది. జిల్లాలలో మంత్రులు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఈ స్మార్టు కార్డులు పంపిణీ చేస్తారు. అలా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్డులను పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.