హైదరాబాద్: సిట్ విచారణ అంశంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించకపోయినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చట్టాన్ని గౌరవించి పూర్తిస్థాయిలో విచారణకు సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకపోయినా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా సిట్ అధికారులకు సహకరించారని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగితే, ముఖ్యమంత్రి మాత్రం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలి తిరుగుళ్లు తిరుగుతూ తన వ్యక్తిగత కోరికలు నెరవేర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ నడిబొడ్డున కోఠిలో పట్టపగలు గన్ కాల్పులు జరిపి డబ్బులు దోచుకున్న ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే గంజాయి స్మగ్లర్లు ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై వాహనం ఎక్కించి హత్య చేసినా, బాధ్యులను పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు.
కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం జాతరలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, ఆవేదనతో మంత్రి కారు అద్దాలు పగలగొట్టి నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా భద్రత, పాలన రెండూ గాడి తప్పాయని అన్నారు.
🎬 సిట్‌లపై వ్యంగ్య వ్యాఖ్యలు
హిట్ 1, హిట్ 2, హిట్ 3 అంటూ సినిమాలు వచ్చినట్లే, ఇప్పుడు సిట్ 1, సిట్ 2, సిట్ 3 అంటూ టైంపాస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై బురదజల్లాలని చూడడం అంటే సూర్యుడిని చూసి ఉమ్ముకోవడమేనని, అది తిరిగి ఉమ్మిన వారి ముఖంపైనే పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణకు పిలిస్తే మీరు ఎందుకు ధర్నాలు చేశారో, మా నాయకుడిని విచారణకు పిలిచినప్పుడు మేము కూడా నిరసనలు చేపట్టామని మహేష్ కుమార్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
🙏 పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు
ఉదయం నుంచి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా వారియర్స్‌కు, గ్రామగ్రామాన నిరసనలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులకు, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు కేటీఆర్ చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
kcr













