పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్రం, రాజస్థాన్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు సింధు జలాలను మళ్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే చర్యలు ప్రగతి చెందుతున్నట్లు జలశక్తి శాఖ తెలిపింది.
పాకిస్తాన్కు సింధు నదీ జలాల నిలిపివేతపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. భారత్ నీళ్లు ఇప్పటి వరకు బయటికి వెళ్లాయని, ఇకపై మన దేశ అవసరాల కోసమే నీటిని వినియోగిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇకపై మన దేశంలోని నీళ్లు మనవేనని, మన నీళ్లను మనమే వినియోగించుకుని ప్రగతి పథంలో ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో సింధు నదీ జలాలపై పాకిస్తాన్కు ప్రధాని మోదీ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లయింది.
పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నదని భావిస్తున్న భారత్.. ఆ దేశాన్ని అన్ని వైపులా ఇరుకున పెట్టేందుకు చకచకా అడుగులేస్తున్నది. పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా కఠిన చర్యలకు దిగుతున్నది. ఇప్పటికే చినాబ్నదిపై ఉన్న బాగ్‌లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా.. తాజాగా ఇదే నదిపై ఉన్న సలాల్ డ్యామ్‌ను కూడా మూసివేసింది. వీటితోపాటు ఈ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్టు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది.
గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్‌లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను భారత్మొదలుపెట్టింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) చూసుకుంటున్నది. ఈ పనులు 3 రోజుల పాటు కొనసాగినట్టు తెలుస్తున్నది. 1987, 2009లో ఈ ప్రాజెక్టులను నిర్మించినప్పటి నుంచీ సింధూ జలాల ఒప్పందం ప్రకారం వాటిని ఫ్లషింగ్ చేయలేదు. చెత్తను తొలగించి, ఆ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచితే కిందికి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి పాకిస్తాన్లో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తీసుకొన్న తొలి చర్య ఇదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యంకాకపోయినా.. భవిష్యత్తులో పాకిస్తాన్కు తీవ్ర నీటి కొరత ఎదురుకావచ్చని చెబుతున్నారు. సింధూ జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై దాదాపు 6 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్‌నీటికి ఎసరు ఖాయమని అంటున్నారు. ఇక సింధూ జలాల ఒప్పందం నిలిచిపోవడంతో.. పాక్‌కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్‌కు లేదు.
సింధు నది ఎక్కడ పుడుతుంది..
సింధు నది సముద్ర మట్టానికి దాదాపు 5,182 మీటర్ల ఎత్తులో టిబెట్‌లోని మానసరోవర్ సరస్సు సమీపంలోని సిన్-కా-బాబ్ ప్రవాహంలో ఉద్భవించి, ఇండియా గుండా ప్రవహించి, పాకిస్తాన్‌లోని కరాచీ నది సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.
ఆసియాలో అతి పొడవైన నదులలో ఒకటైన సింధు నదీ పరీవాహక ప్రాంతాన్ని చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో 60 శాతం పాకిస్తాన్‌లో ఉంది. సింధు నది ఇక్కడి అనేక ప్రావిన్సులలో వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు మూలం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఏకైక నది ఇదే కాబట్టి దీనిని పాకిస్తాన్ జీవనాధారంగా పిలుస్తారు.
సింధు నది పొడవును పరిశీలిస్తే, ఈ నది వైశాల్యం దాదాపు 11,65,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ నది మొత్తం పొడవు 3,180 కి.మీ. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే ఐదు నదులు సింధు నదికి ప్రధాన ఉపనదులు. పాకిస్తాన్ భూమిలో 92 శాతం శాశ్వత నీటిపారుదల వ్యవస్థ లేనందున సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఏకైక ఆధారం.
దాదాపు 3,200 కిలోమీటర్ల పొడవున్న సింధు నది భారతదేశంలో దాదాపు 800 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఈ నది జమ్మూ కశ్మీర్, లడఖ్ గుండా ప్రవహిస్తుంది. అయితే, వాస్తవానికి, ఈ నదిలో ఒక చిన్న భాగం మాత్రమే భారత నియంత్రణలో ఉంది.
సింధు నది దాని ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. భారతదేశంలో సట్లెజ్ నదిపై భాక్రా ఆనకట్ట, బియాస్ నదిపై పండో ఆనకట్ట, చీనాబ్ నదిపై బాగ్లిహార్, దుల్హస్తి ఆనకట్టలు, జీలం నదిపై ఉరి, కిషన్‌గంగా ప్రాజెక్టులు నిర్మించారు. పాకిస్తాన్‌లో సింధు నదిపై తుర్బెలా ఆనకట్ట, జీలం నదిపై మంగళ ఆనకట్ట, నీలం-జీలం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ఆనకట్టలన్నీ ఇండియా, పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తికి, నీటిపారుదల వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి.