నటుడన్న తర్వాత ఎవరికైనా కెరీర్లో ఫలానా క్యారెక్టర్ చేయాలని, ఫలానా వారితో కలిసి నటించాలని ఉంటుంది. ఎప్పటికైనా తమ కెరీర్లో అలాంటి పాత్ర చేయాలని వారు కోరుకుంటారు. ఎప్పుడెప్పుడు ఆ డ్రీమ్ రోల్ లో నటిస్తామా అని ఎంతగానో ఎదురు కూడా చూస్తుంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్ రోల్ ఉంటుంది. తాజాగా శృతి హాసన్ తన డ్రీమ్ రోల్ గురించి వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా శృతి హాసన్ పెద్దగా లైమ్ లైట్ లో లేకపోయారు. కానీ ఎప్పుడైతే ఆమెకు వరుస హిట్లు పడ్డాయో అవి ఆమె కెరీర్ ను ఒక్కసారిగా మళ్లీ బిజీగా మార్చాయి. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్1 లాంటి సినిమాలతో భారీ హిట్లు అందుకున్న శృతి హాసన్ కు ఇప్పుడు తిరిగి భారీ ఆఫర్లొస్తున్నాయి. ప్రస్తుతం శృతి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా కూలీ లో శృతి హాసన్ కీలక పాత్ర లో నటించారు. ఆగస్ట్ 14న కూలీ సినిమా రిలీజ్ కానుండగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో శృతి హాసన్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు తాను కెరీర్ లో చేసిన ఛాలెంజింగ్ రోల్స్ లో కూలీ లోని పాత్ర కూడా ఒకటని వెల్లడించారు.
ఇదే సందర్భంగా తన డ్రీమ్ రోల్ గురించి కూడా శృతి వెల్లడించారు. ఏదైనా సినిమాలో తాను మ్యూజీషియన్ పాత్రలో నటించాలని ఉన్నట్టు ఆసక్తిని వెల్లడించారు. మ్యూజిషియన్ క్యారెక్టర్ లో నటించడం తన చిరకాల కోరిక అని శృతి తెలిపారు. అయితే శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, సింగర్, మ్యూజీషియన్ కూడా. కమల్ హాసన్ నటించిన ఈనాడు సినిమాకు శృతి హాసన్ సంగీతం అందిస్తూ తన కెరీర్ ను స్టార్ట్ చేశారనే విషయం తెలిసిందే. తన మొదటి కెరీర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని శృతి ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు. మరి శృతి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.