బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అభిమానులతో పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా తన బ్లాగ్‌లోనూ బిగ్‌బి పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి, ఇతర హీరోల సినిమాల గురించి, సోషల్ అవైర్‌నెస్ గురించి బచ్చన్ ఎక్కువగా పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఆయన బ్లాగ్ ద్వారా షోలే టికెట్‌ను షేర్ చేయడం జరిగింది. వచ్చే నెలలో షోలే సినిమా 50 ఏళ్ల ఉత్సవం జరిపేందుకు బాలీవుడ్ రెడీ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. షోలే సినిమా ఇండియన్ సినిమాకు గర్వకారణం అనడంలో సందేహం లేదు.
దేశవ్యాప్తంగా షోలే సినిమా అప్పట్లో ప్రదర్శించబడింది. స్వాతంత్య్ర భారతంలో అత్యధికంగా వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా షోలే అప్పట్లో నిలిచింది. ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు చక్కని ఉదాహరణ అన్నట్లుగా షోలే నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇండియన్ సినిమాకు దిశా, నిర్ధేశం చేసిన సినిమాల్లో షోలే ముందు వరుసలో ఉంటుంది. మంచి కథ, కథనంతో వచ్చిన షోలే సినిమా అమితాబ్ బచ్చన్‌కి స్టార్‌డంను తెచ్చి పెట్టింది. అంతే కాకుండా ఆ సినిమాలో నటించిన మరో హీరో ధర్మేంద్ర సైతం అప్పట్లో స్టార్‌డం దక్కించుకున్నారు. రమేష్ సిప్పీ దర్శకత్వంలో రూపొందిన షోలే సినిమా అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోబోతుంది.
1975, ఆగస్టు 15న విడుదలైన షోలే సినిమా ఏళ్లకు ఏళ్లు థియేటర్లలో నడిచింది. మార్పి మార్చి సినిమాను ఏకంగా మూడు నాలుగు ఏళ్ల పాటు ఆడించారు. చాలా చోట్ల ఏకంగా ఐదు ఏళ్లు కూడా నడిచింది అంటారు. కొన్ని చోట్ల థియేటర్లు పూర్తిగా షోలే సినిమాకు కేటాయించారు. ఆ థియేటర్‌లలో పదుల సంవత్సరాల పాటు రోజుల కనీసం ఒక్క షో అయినా షోలే పడింది అంటారు. అంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న షోలే సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ అప్పటి జ్ఞాపకాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన తన వద్ద ఉన్న షోలే మూవీ థియేటర్ టికెట్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
అమితాబ్ షేర్ చేసి షోలే టికెట్ పై రూ.20లు ఉంది. అప్పట్లో చాలా థియేటర్‌లలో టికెట్ల రేట్లు అయిదు నుంచి పది రూపాయలు మాత్రమే ఉంది. కానీ స్పెషల్ క్లాస్ టికెట్ కావడంతో పాటు, ప్రైమ్ ఏరియా థియేటర్ కావడం వల్ల ఎక్కువ టికెట్ మొత్తం ఉండి ఉంటుంది. అప్పట్లో అన్ని టికెట్ల రేట్లు రూ.20 లు ఉన్నా వచ్చిన మొత్తంకు దాదాపుగా మూడు నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు నమోదు అయ్యేవి. అమితాబ్ బచ్చన్ ముందు ముందు షోలే గురించి మరిన్ని జ్ఞాపకాలను షేర్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక సినిమా యాబై ఏళ్లు పూర్తి చేసుకుంది అంటే అందులో నటించిన వారు చాలా అరుదుగా ఉంటారు. కానీ షోలే సినిమాకు సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు. వారంతా వచ్చే నెలలో జరగబోతున్న 50 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.