బంధాలకు.. అనుబంధాలకు ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదల్ని ఇవ్వకుండా పోవటం ఒక ఎత్తు. అర్థం లేని ఆవేశంతో.. అవసరానికి మించిన కోరికలతో కుటుంబ సభ్యుల్ని చంపుకునే మాయరోగం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. భర్తల్ని చంపే భార్య.. అర్థం లేని ఆవేశంతో తల్లిదండ్రుల్ని చంపేసే దారుణ ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవలోకు వచ్చేదే. ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న దారుణ ఘటన గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే.
ఆ రాష్ట్రంలోని జోగిదీప అనే ఒక గ్రామం ఉంది. అక్కడకు చెందిన కమలేశ్ అనేటోడు ఇంటికి వచ్చేటప్పుడు చేపల్ని తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. చేపల కూర చేయాలన్నాడు. అప్పటికే చీకటి పడటంతో తర్వాతి రోజు చేపల కూర చేస్తానని చెప్పటంతో తల్లి కొడుకుల మధ్య గొడవ జరిగింది. చివరకు తాను చేపలకూర చేయనని.. ఉదయాన్నే చేస్తానని తల్లి తెగేసి చెప్పింది. ఇదిలా ఉండగా.. తెల్లవారి లేచి చూసే సరికి చేపలకు చీమలు పట్టి ఉండటంతో కొడుకు తీవ్ర కోపానికి గురయ్యాడు. అర్థం లేని ఆవేశంతో గొడ్డలి తీసుకొని కన్న తల్లిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చేపలకు చీమలు పట్టాయన్న కోపంతో తల్లిని చంపటమా? అన్నదిప్పుడు షాకింగ్ గా మారింది.