కింగ్ ఖాన్ షారూఖ్ అసాధారణ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లోను అతడికి భారీగా అభిమానులు ఉన్నారు. పశ్చిమ దేశాలలో హాలీవుడ్ స్టార్లను మించిన పాలోయింగ్ అతడికి ఉందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఖాన్ నటించిన చాలా చిత్రాలు జర్మనీ – ఫ్రాన్స్ వంటి హిందీ మాట్లాడని దేశాలలో కూడా రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇటీవల దర్శకనిర్మాత- నటుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. తాను , షారుఖ్ ఒకే కార్యక్రమంలో ఉన్నప్పుడు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో అభిమానులు కూడా .. ఖాన్ కోసం ఇతరులను ఎలా విస్మరించారో తాను చూశానని వెల్లడించాడు. ఖాన్ ముందు ఇతర హీరోలు చిన్నబోతారని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు.
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉన్నప్పుడు… డికాప్రియో కూడా అదే చోట ఉన్నారు.. కానీ అక్కడ షారూఖ్ చుట్టూ జనం అధికంగా ఉన్నారని కూడా అనురాగ్ వెల్లడించారు. ఖాన్ కి ఫిలింఫెస్టివల్ లో గొప్ప గుర్తింపు, గౌరవం ఉన్నాయని అన్నారు. అయితే ఇది అతడు దశాబ్ధాలుగా నిర్మించుకున్న ఘన చరిత అని కూడా అన్నారు.
షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పఠాన్, జవాన్, డంకీ తర్వాత షారూఖ్ చేస్తున్న అసాధారణ ప్రయత్నమిది. మరోవైపు అనురాగ్ కశ్యప్ ఇటీవల బాలీవుడ్ ని వదిలేసి పూర్తిగా బెంగళూరుకే అంకితమయ్యారు. అతడు సౌత్ సినిమాలలో నటిస్తూ, దర్శకుడిగాను కొన్ని చిత్రాలను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అనురాగ్ దర్శకత్వం వహించిన నిశాంచి విడుదలకు సిద్ధమవుతోంది.