ఏ మాయ చేసావె సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సమంత తక్కువ టైమ్ లోనే చాలా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ మంచి క్రేజ్, స్టార్‌డమ్ ను కూడా అందుకున్నారు. సమంత ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి అయింది. తన కెరీర్లోనే ఎన్నో సక్సెస్‌లు, ఫ్లాపులు, ఇబ్బందులు, సమస్యల్ని ఎదుర్కొన్న సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో పాటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
తన వరకు ఎన్ని సినిమాలు చేశామనే దాని కంటే ఆడియన్స్ కు గుర్తుండిపోయే సినిమాలు ఎన్ని చేశామనేదే ముఖ్యమని అంటున్నారు సమంత. ఓ వైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు సామ్. ప్రస్తుతం బాలీవుడ్ రక్త్‌బ్రహ్మాండ్ లో నటిస్తున్న సమంత ఇకపై ఎక్కువగా సినిమాలు చేయనని, తక్కు సినిమాలు చేసినా గుర్తుండిపోయే పాత్రలు, మహిళలకు ఉపయోగపడే పాత్రలే చేస్తానని అంటున్నారు సమంత.
తన లైఫ్ లో సోషల్ మీడియా పాత్ర చాలా ఉందని, తనకు సరైన మార్గదర్శకులను చూపించింది అదేనని, అందుకే అందరూ చెప్తున్నట్టు సోషల్ మీడియా డేంజర్ అని తాను భావించనని, తన వరకు సోషల్ మీడియాలో కూడా రియాలిటీను చూపించడానికే ఇష్టపడతానని, హెల్త్ కు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ తాను కూడా సోషల్ మీడియాను మంచి కోసమే వాడుతున్నానని చెప్పిన సమంత ఆన్‌లైన్ లో వచ్చే పాజిటివిటీని ఎలా తీసుకుంటామో, నెగిటివిటీని కూడా అంతే తీసుకోవాలని, మనం సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి కానీ అది మన లైఫ్ ను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండకూడదని ఆమె చెప్పారు.
ఆడపిల్లలంటే కొన్ని లిమిట్స్ ఉంటాయని చిన్నప్పట్నుంచే చెప్తూ వస్తుంటారని తనక్కూడా అలానే చెప్పారని, కానీ అవన్నీ అబద్దాలని ఎదిగేకొద్దీ తెలిసిందని, అమ్మాయిలెవరైనా సరే భయంతో దేన్నీ మొదలుపెట్టొద్దని, నమ్మకంతో అడుగులేస్తే ఏదైనా సాధించగలరని చెప్పారు. రిస్క్ తీసుకుని ముందడుగు వేసే వారే సక్సెస్ అవుతారని, దూరదృష్టి ఉన్న ప్రతీ ఒక్కరూ ముందడుగు వేయాలని, ప్రపంచం వారి నాయకత్వాన్నే కోరుకుంటుందని ఆమె చెప్పారు.
ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలు, ఫిట్‌నెస్ పైనే ఉందని, వాటిపై తనకెంతో ఇంట్రెస్ట్ ఉందని, గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో చాలా మార్పొచ్చిందని, మంచి మంచి పనులు చేసే పొజిషన్ కు వచ్చానని అంటున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న తాను ఇండస్ట్రీలో ఎప్పటికీ తాను రెగ్యులర్ స్టూడెంట్‌నేనని చెప్తున్నారు.
 
			



















