డీ ఫ్యాక్టో సీఎం అనే ముద్ర తనపై ఉండటాన్ని ఓ ప్రివిలేజ్ గా భావించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చాలా తెలివిగా వ్యవహరించారు. జగన్ రెడ్డి చేసిన స్కాముల్లో, తప్పుడు పనుల్లో తన పాత్రేమీ బయటకు రాకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించారు. లిక్కర్, మైనింగ్ సహా ఎన్నో అరాచకాలు వైసీపీ హయాంలో జరిగాయి. కానీ ఏ స్కాములోనూ సజ్జల పేరు ప్రముఖంగా వినిపించడం లేదు. అసలు ఆయన పేరు స్కాముల్లో చర్చకు రావడం లేదు. ఎప్పుడూ జగన్ వెంట ఉంటూ.. నాటి సీఎంవోలోనే తిష్ట వేసి మరీ చక్రం తిప్పిన సజ్జల ఇలా ఎలా మేనేజ్ చేయగలిగారన్నది వైసీపీ నేతలకు అంతుబట్టడం లేదు.
2019లో వైసీపీ గెలిచినప్పుడు నెంబర్ 2 పొజిషన్ లో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆ తర్వాత ముఖ్య సలహాదారుగా చేరి సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లగా అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేశారు. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా అయినా ఆయన చెప్పిందే జరుగుతుందన్నట్లుగా మారిపోయింది. లిక్కర్ స్కాం గురించి ఆయనకు తెలియదని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే జగన్ కు సంబంధించి ఇలాంటి ప్రతి వ్యవహారం ఆయనే డీల్ చేస్తారు. కానీ ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. అదే వైసీపీలో అందరికీ ఆశ్చర్యకరంగా మారింది.
సజ్జలపై ఇప్పటి వరకూ వచ్చిన ఆరోపణలు చిన్నవే. టీడీపీ ఆఫీసుపై దాడి చేయించడం వంటి కుట్రల విషయంలోనే కేసులు నమోదయ్యాయి. పెద్ద పెద్ద స్కాముల్లో జగన్ రెడ్డి ఇరుక్కుంటున్నారు కానీ సజ్జల గురించి ఎవరూ చెప్పడం లేదు. ఈ పరిణామాలు చూస్తే.. సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత తెలివిగా వ్యవహరించారని భావించవచ్చని అంటున్నారు. దొరికిపోయే ఎలాంటి వ్యవహారాల్లోనూ బయటకు కనిపించకుండా…. పనులు చక్కబెట్టారని..ఆ పనుల్లో పాత్రధారులు, సూత్రధారుల్లో తన పాత్ర బయటక కనిపించకుండా చేసుకున్నారని అనుమానిస్తున్నారు.
సజ్జల కుటుంబం ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్లు సంపాదించుకున్నారని వైసీపీ నేతలు అంతర్గతంగా చెబుతూ ఉంటారు. హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన నివాసంతో పాటు అనేక ఆస్తులు, వ్యాపారాలను ప్రారంభించారని అంటున్నారు. విచిత్రంగా.. వైసీపీలో కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలు కూడా. దొరికిపోయారు కానీ.. ఇలాంటి విషయాల్లో సజ్జల పేరు కూడా బయటకు రాకపోవడం.. ఆయనపై ఈగ వాలకపోవడంతో .. జగన్ ను ముంచేసినా పర్వాలేదు తాను బయటపడాలని ముందు నుంచీ ఆయన ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారన్న అనుమానాలు వైసీపీ క్యాడర్ లో వ్యక్తమవుతున్నాయి.