మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి 2021లో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదాన్ని అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అది బైక్ ప్రమాదం. ఆ సమయంలో సాయిధరమ్ సూపర్ బైక్ పై రైడ్ చేస్తున్నాడు. ఆ ప్రమాదం తర్వాత అతడు కోలుకోవడానికి ఏడాది పైగానే పట్టింది. అతడు నటించిన సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. బైక్ స్కిడ్ అయ్యి కింద పడటంతో అతడి తలకు గాయమైంది. అయితే అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలించి అతడు కోలుకుని, ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు.
చాలా కాలం తర్వాత సాయి తేజ్ కి బైక్ డ్రైవింగ్ గురించి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా సాయి తేజ్ స్పందించిన తీరు హృదయాలను గెలుచుకుంది. అతడు పవన్ కల్యాణ్ బైక్ రైడింగ్ గురించి మాట్లాడుతూ మావయ్య చాలా జాగ్రత్తగా ఉంటారని, జాగ్రత్తగా ఉండాలని చెబుతారని అన్నాడు. మీరు ఎప్పుడైనా మావయ్యలను బైక్ పై ఎక్కించుకుని రైడ్ కి వెళ్లారా? అని హోస్ట్ ప్రశ్నించగా… నేను నా మావయ్య (చిరంజీవి, పవన్ కళ్యాణ్) లను వెనక ఎక్కించుకుని ఎప్పుడూ బైక్ డ్రైవ్ చేయలేదని సాయిధరమ్ తెలిపారు. ఆ అవకాశం రాలేదని అన్నారు. “పవన్ కళ్యాణ్ గారికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన బైక్ రైడింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు“ అని తెలిపాడు. అంతేకాదు.. ఎవరైనా బైక్ డ్రైవ్ చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారని సాయి తేజ్ అన్నారు. వాహన ప్రమాదాలపై హెచ్చరిస్తూ సేఫ్టీ నియమాలపై అవగాహనాకార్యక్రమం (సమ్మిట్ 2025) లో సాయి తేజ్ ఈ విషయాలను మాట్లాడారు.
లైఫ్ లో ఒకే ఒక్క ప్రమాదం.. మెగా మేనల్లుడికి చాలా జాగ్రత్తలు నేర్పించింది. ఇది కేవలం మెగా మేనల్లుడికే వర్తించదు. యువతరం అందరికీ ఇది ఒక మేలుకొలుపు. హెల్మెట్ ధరించి బైక్ ప్రయాణం చేయాలనేది ట్రాఫిక్ రూల్. దానిని బేఖాతరు చేసేవాళ్లే ఎక్కువ. హెల్మెట్ రూల్ పాటించేందుకు విముఖత చూపే యువతరానికి కూడా సాయి తేజ్ మాటలు ఒక మేల్కొలుపు. సాయి తేజ్ నటించిన `సంబరాల ఏటిగట్టు` త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం తన సినిమాని ప్రమోషన్స్ లో బిజీ కానున్నారు.