కన్నడ, తెలుగు భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేసింది. ఒక వ్యక్తి ఆమెలా మాట్లాడుతూ, నకిలీ నంబర్ నుండి ప్రజలను సంప్రదిస్తున్నాడని తెలిపింది. ఆ నంబర్ తనది కాదని, ఆ కాల్స్ లేదా మెసేజ్‌లను ఎవ్వరూ స్పందించవద్దని కోరింది. ఇలాంటి చర్యలు సైబర్ నేరం కింద వస్తాయని, దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని రుక్మిణి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె యశ్‌తో కలిసి నటిస్తున్న ‘టాక్సిక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించినా ‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో అపారమైన క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ . సహజమైన నటన, అందం, పాత్రల ఎంపిక ఆమెను క్రేజీ హీరోయిన్‌గా నిలబెట్టాయి. ‘ కాంతార చాప్టర్ 1 ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న రుక్మిణి ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న రుక్మిణీ తాజాగా చేసిన పోస్ట్ అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. ఆమె పేరుతో జరిగే మోసాల గురించి ఆమె బహిరంగంగా హెచ్చరికలివ్వడం చర్చనీయాంశమైంది.
రుక్మిణీ వసంత్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా ఆమె పేరు వినియోగించి ఒక వ్యక్తి ఇతరులను సంప్రదిస్తూ వారిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి 9445893273 నంబర్ ద్వారా అచ్చం ఆమె లానే మాట్లాడుతుండటంతో అభిమానులు, పరిశ్రమ వ్యక్తులు, బ్రాండ్ ప్రతినిధులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. దీనిపై రుక్మిణి స్పందిస్తూ “ఈ నెంబర్ నాది కాదు. ఈ నెంబర్ నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పందించవద్దు. నా పేరును ఉపయోగించడం, నకిలీ స్వరంతో ఇతరులను మోసం చేయడం ఒక సీరియస్ సైబర్ నేరం. ఇందులో ఎవరి ప్రమేయమున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు చేస్తాను” అని క్లియర్ గా తెలిపింది. అలాగే అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి ఎలాంటి డౌట్ వచ్చినా తనను లేదా తన టీమ్‌ను నేరుగా సంప్రదించాలని, మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రుక్మిణి చేసిన ఈ బహిరంగ హెచ్చరిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


















