నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల – బత్తలూరు మధ్యన వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. ఆళ్లగడ్డ డీఎస్పి కె. ప్రమోద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులంతా తెలంగాణకు చెందినవారుగా గుర్తించారు.
నంద్యాల జిల్లా ప్రమాదంపై మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశించారు. అనంతరం మృతుల కుటుంబాలకు బీసీ జనార్ధన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.











