ఈ మాట అన్నది ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖను చూస్తున్న పవన్ కళ్యాణ్. ఆయన తాజాగా తిరుపతి జిల్లాలో పర్యటించారు. అక్కడ మంగళంలోని ఎర్రచందనం డిపోని సందర్శించారు. డిపోలో మొత్తం ఎనిమిది గోడౌన్లు ఉంటే ప్రతి గోడౌన్ ను ప్రతి దుంగను పవన్ నిశితంగా పరిశీలించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి. ఎర్ర చందనం చెట్లను నరికేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. స్మగ్లర్లు ఎంత సంపద దోచుకోవడానికి ప్రయత్నించారో అలాగే, ఎన్ని లక్షల చెట్లను నరికేశారో ప్రపంచం మొత్తానికి తెలియాలన్నదే తన తపన కోరిక అని అధికారులకు పవన్ స్పష్టం చేశారు.
అటవీ శాఖలో పెద్ద ఎత్తున వృక్ష సంపద విధ్వంసం జరుగుతోంది అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. . కొన్ని లక్షల చెట్లను చందన స్మగ్లర్లు నరికి వేయడం కారణంగానే డిపోల్లోకి ఊహకు అందని విధంగా లక్షల ఎర్ర చందనం దుంగలు చేరాయని పవన్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది జాతి సంపద అని విచ్చలవిడిగా దోచుకున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇక మీదట ప్రతీ ఎర్ర చందనం దుంగకూ జియో ట్యాగింగ్ ద్వారా లైవ్ ట్రాకింగ్ చేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అనుమతి లేనిదే ఒక్క దుంగ కూడా బయటకు పోకూడదు అని ఆయన హెచ్చరించారు. ఎర్రచందనం దుంగలు పట్టుబడిన దగ్గర నుంచి అమ్మకం జరిపే వరకు అనుమతి లేకుండా ఒక్క దుంగ కూడా పక్కదారి పట్టడానికి వీల్లేదని పవన్ గట్టిగానే సందేశం ఇచ్చారు. గతంలో ఉన్న లాట్లు, నంబర్లు ఇచ్చే పాత విధానాల స్థానంలో అధునాతన సాంకేతికతతో విలువైన ఎర్రచందనం దుంగలకు భద్రత కల్పించనున్నట్టు కూడా పవన్ చెప్పడం విశేషం.
ఇదిలా ఉంటే పవన్ ని ఒక విదేశీ మొక్క ఎంతగానో ఆకట్టుకుంది దాని వివరాలను ఆయన అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నరు. టెరోమా జేరా అనే విదేశీ జాతికి చెందిన మొక్క అది. ఇది ఏపుగా, ఎత్తుగా ఎదిగే స్వభావం ఉన్న మొక్క. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఆకులు మొత్తం రాలిపోయాక పూలతో కనువిందు చేస్తుంది. ఆ వివరాలు అధికారులు చెబుతూంటే పవన్ మొత్తం ఆసక్తిగా విని ఆ మొక్క పట్ల ఎంతో మోజు పెంచుకున్నారు.
ఎర్ర చందనం అంటేనే ఎంతో ఖరీదు అయినది. దాని విలువ చాలానే ఉంటుంది. అయితే దానిలో కూడా ఎన్నో గ్రేడ్లు ఉంటాయి. మరి ఎల వీటికి గ్రేడింగ్స్ ఇస్తారు అంటే నాణ్యత ఆధారంగా దుంగల గ్రేడ్లు నిర్ణయిస్తారని అధికారులు చెబుతున్నరు.సుత్తితో దుంగ మీద శబ్దం చేస్తే వచ్చే ఆ సౌండ్ బట్టే ఆ దుంగ గ్రేడ్ నిర్ణయించబడుతుంది. పవన్ సైతం సుత్తితో ఎర్ర చందనం దుంగలను కొట్టి శబ్దం ఆధారంగా గ్రేడ్లలో ఉన్న తేడాలను స్వయంగా తెలుసుకున్నారు. ఇక ఎర్రచందనంతో తయారు చేసిన విగ్రహాలు, బ్రీడ్స్, చిన్న చిన్న వస్తువుల తయారీ కోసం కట్ చేసి అమ్మకానికి ఉంచిన చిన్న చిన్న ముక్కలు, ఔషదాల తయారీలో వినియోగించే ఎర్రచందనం రంపపు పొట్టును సైతం పవన్ ఎంతో నిశితంగా పరిశీలించడం విశేషం. అంతే కాదు వాటికి ఎక్కడ మార్కెట్ ఉంది ఇక వాటిని ఎవరెవరు కొంటారు తదితర వివరాలు కూడా అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.


















