పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ.2వేల నోట్ల గురించి తెలిసిందే. ఇలా వచ్చి అలా మాయమైన నోట్లలో రూ.2వేల నోటుది ఒక ప్రత్యేకత. రెండేళ్ల క్రితం ఈ నోటు చలామణిని నిలిపేస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోవటం.. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయటం తెలిసిందే. అయితే.. ఇప్పటికి రూ.2వేల నోట్లు రిజర్వు బ్యాంక్ కు తిరిగి రావాల్సిన మొత్తం భారీగా ఉందన్న విషయం వెలుగు చూసింది.
ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2023 మే 19న ఈ పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడే వేళకు మార్కెట్ లో రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు మార్కెట్ లో ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది (2025) ఆగస్టు 31 నాటికి చలామణిలో రూ.5956 కోట్ల నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకునే వేళ.. మార్కెట్ లో ఉండే మొత్తంతో పోలిస్తే దాదాపు ఒకటిన్నర శాతం నోట్లు మార్కెట్ లోనే ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఈ నోట్లకు మార్కెట్ లో ఎలాంటి విలువ లేకున్నప్పటికి.. రిజర్వు బ్యాంక్ కు వెనక్కి రాకపోవటం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగామారింది. అయితే.. రూ.2 వేల నోట్లను రద్దు చేయలేదు అని అవి అధికారికంగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఎవరి వద్ద అయినా రూ.2వేల నోట్లు ఉంటే ఒక పద్దతి ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఇండియా పోస్టు ద్వారా హైదరాబాద్.. బెంగళూరు..చెన్నైలో ఉండే ఆర్ బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపి.. వాటిని మార్చుకునే వెసులుబాటు ఉంది. ఏమైనా పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఇంత భారీగా మార్కెట్లో ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పకతప్పదు.