ఒకరు చేయాల్సిన సినిమాలు వారు వదులుకోవడం వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో వేరే వారి చేతుల్లోకి వెళ్తాయి. అయితే ఆ విషయాలు కొన్ని సార్లు బయటకు వస్తే మరికొన్ని సార్లు మరుగున పడతాయి. ఇంకొన్ని సార్లు చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా ఆ విషయాలు బయట పడుతూ ఉంటాయి. ఇప్పుడలానే ఓ విషయాన్ని వెల్లడించారు బాలీవుడ్ నటి రవీనా టాండన్.
హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన రవీనా గతంలో తాను ఓ సూపర్ స్టార్ ఫిల్మ్ ను వదులుకున్నట్టు ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టారు. ఆ సినిమానే డర్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యష్ చోప్రా దర్శకత్వంలో 1993లో వచ్చిన డర్ సినిమాలో సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్ గా నటించగా, ఆ సినిమా కోసం మేకర్స్ ముందుగా తననే సంప్రదించారని చెప్పారు రవీనా.
ఆ సినిమాలోని కొన్ని సీన్స్ నచ్చకపోవడం మరియు మూవీలో స్విమ్ సూట్ లో కనిపించాల్సి రావడం వల్లే డర్ మూవీని తాను వదులుకున్నట్టు 32 ఏళ్ల తర్వాత రవీనా అసలు విషయాన్ని బయటపెట్టారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనకు తానుగా కొన్ని రూల్స్ ను పెట్టుకున్నానని, వాటిని బ్రేక్ చేసి కాంప్రమైజ్ అవడం ఇష్టలేకనే భారీ ఆఫర్ అయినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసినట్టు రవీనా వివరించారు.
అయితే తాను డర్ సినిమాకు నో చెప్పాక ఆ ఛాన్స్ జూహీ చావ్లాకు వెళ్లిందని ఆమె గుర్తు చేసుకున్నారు. డర్ మూవీలో సన్నీ డియోల్ హీరోగా నటించగా, షారుఖ్ విలన్ గా మెప్పించారు. డర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, ఆ సినిమాలో షారుఖ్ యాక్టింగ్ కు ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ మూవీకి షారుఖ్ బెస్ట్ విలన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
డర్ తో పాటూ ప్రేమ ఖైదీ ఆఫర్ కూడా ముందుగా తనకే వచ్చిందని, అందులో కూడా ఓ సీన్ నచ్చకపోవడం వల్లే ఆ ఆఫర్ ను కూడా వదులుకున్నట్టు చెప్పిన రవీనా, కెరీర్ స్టార్టింగ్ లో చాలా చిన్న విషయాలకు కూడా సినిమాలను వదులుకునే దాన్నని అన్నారు. నచ్చని వ్యక్తులతో తాను మొదటి నుంచే యాక్ట్ చేయనని, ఇప్పటికీ తాను దాన్నే ఫాలో అవుతున్నట్టు రవీనా చెప్పుకొచ్చారు.


















