ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అందుకున్న రామ్ చరణ్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని గట్టిగా కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తనకు వచ్చిన గ్లోబల్ స్టార్‌డమ్ ను నిలబెట్టుకోవడానికి చరణ్ చాలానే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను పట్టాలెక్కించారు చరణ్.
సెప్టెంబర్ 5 నుంచి పెద్ది కొత్త షెడ్యూల్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా మైసూరు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న పెద్ది సినిమా ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్టు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి పెద్ది సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలవనున్నట్టు సమాచారం.
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నారని ఇప్పటికే లీకులొచ్చాయి. ఆ లీకులకు తగ్గట్టే మొన్నా మధ్య సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ షాట్ లో చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఆల్రెడీ పెద్ది నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో, ఆ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ పెద్దిలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.