ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు(AP MLA) , ఎమ్మెల్సీలు (MLC) తమ రాజకీయ పనుల్లో స్వల్ప విరామం తీసుకుని వినోదంతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉండే నేతలు ఈసారి క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శించారు. విజయవాడలోని ‘ఏ’ కన్వెషన్ సెంటర్‌లో (A Convection centre) జరిగిన ఈ కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని నటనా ప్రతిభను బయటకు తీసుకువచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghu Ram Krishna Raju) తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన మహాభారతంలోని దుర్యోధనుడి వేషధారణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటించగా, ఆ హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన అభినయంతో ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడిని గుర్తు చేశారు. “ఏమంటివి.. ఏమంటివి..?” అనే డైలాగ్ చెప్పినప్పుడు హాల్ కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లు కూడా ఆయన్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టడం విశేషం.
ఇక టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఆయన పల్నాటి బాలచంద్రుడి పాత్రను పోషించి, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో సభను ఉర్రూతలూగించారు. ఆయన వేషధారణ, హావభావాలు చూసిన సభ్యులు ప్రశంసలు కురిపించారు. వీటితో పాటు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావులు తమ హాస్య నటనతో సభలో నవ్వుల వర్షం కురిపించారు. పాటలు పాడుతూ, సరదాగా ప్రవర్తిస్తూ అందరినీ అలరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ క్షణాలను ఆస్వాదిస్తూ హర్షధ్వానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నేతలలోని మరొక కోణాన్ని ప్రజలు చూడగలిగారు. రాజకీయాల్లో సీరియస్ గా కనిపించే నేతలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వినోదాత్మకంగా అనిపించింది. వీరి నటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు వీటిని షేర్ చేస్తూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి రెండు రోజులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజకీయ ఒత్తిడిని మరిచి తమ వినోదం కోసం సమయం కేటాయించుకోవడం అందరికీ కొత్త అనుభూతిని కలిగించింది.
విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషంలో నటించి అదరగొట్టారు. సీనియర్ ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ‘ఏమంటివి..ఏమంటివి?’ అంటూ రఘురామకృష్ణరాజు ఏకపాత్రాభినయం చేశారు. రఘురామ డైలాగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు అక్కడున్న వారి చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేచి నిలబడి మరీ రఘురామను చప్పట్లతో అభినందించారు. ఇక పల్నాటి బాలచంద్రుడి వేషంలో మంత్రి కందుల దుర్గేష్ కూడా అదరగొట్టేశారు.