పూసపాటి రాజులు అంటేనే వందల ఏళ్ళ చరిత్ర కళ్ళ ముందు మెదులుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం సంస్థానాధీశులుగా ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత స్వాతంత్రం వస్తూనే ప్రజాస్వామ్యంలోనూ రాజులుగానే నిలిచారు. ప్రజలు సైతం రాజులకు ఎదురు వెళ్ళకూడదని సమాదరించారు. ఎందరు పోటీలో ఉన్నా రాజులదే విజయం అయ్యేది. సామాజిక సమీకరణలు రాజకీయ ఎత్తుగడలు అన్నీ తల్లకిందులు అయ్యేవి.
ఇక విజయనగరం చూస్తే అణువణువు కూడా పూసపాటి సంస్థానాధీశులదే. అక్కడ ఉన్న బొంకుల దిబ్బ బజారు నుంచి మొదలు పెడితే పెద్ద బజారు, మార్కెట్ అన్నీ కూడా కోటకు చెందిన ఆస్తులే. అయితే వాటిని కడు ఉదారంగా వ్యవహరించి ఎవరికి వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చిన ఘనత పూసపాటి వారికే దక్కింది. వారికి ఆస్తుల మీద ప్రేమ లేదు, భూములు అన్నీ తమవే అయినా చాలా చోట్ల పంచేశారు. వదిలేసుకున్నారు. ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇచ్చారు. అలా బడులు గుడులు ఆసుపత్రులు అన్నింటా పూసపాటి వంశీకుల ముద్ర స్పష్టంగా ఉంటుంది.
ఉత్తరాంధ్రలో అతి పెద్ద సంస్థానంగా పూసపాటి వంశీకులది ఉంటుంది. వందేళ్ళకు పూర్వం చూస్తే విజయనగరం పెద్దది, విశాఖ ఒక చిన్న పల్లెకారు ప్రాంతం. అలా విశాఖ నుంచి విజయనగరం దాకా అవతల బొబ్బిలి దాకా తమ సంస్థానాన్ని విస్తరించుకుని పాలించారు పూసపాటి వారు. ఇక పీవీజీ రాజు ప్రజా జీవితంలోకి వచ్చి సక్సెస్ ఫుల్ గా ఎంపీగా అనెకా సార్లు గెలిచారు. ఆయన వారసులుగా కుమారులు ఆనందగజపతి రాజు, అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఇద్దరూ మొదట్లో టీడీపీలో ఉండేవారు. ముందు ఆనంద్ మంత్రి అయ్యారు. తరువాత అశోక్ అయ్యారు. ఆనంద్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరి ఎంపీ అయ్యారు. తదనంతర కాలంలో ఆయన రాజకీయాలు వదిలేశారు. ఆయన 2016లో కాలం చేశారు. ఇక అశోక్ గత పదేళ్ళుగా మొత్తం తానై పూసపాటి వారి ఖ్యాతిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇపుడు కూడా ఆయనకు సమున్నత గౌరవం లభించింది.
గోవాకు గవర్నర్ గా వెళ్తున్నారు. అయితే పూసపాటి రాజ్యానికి రాజకీయానికి ఎవరు పెద్ద దిక్కు అన్నదే ఇపుడు కోటలో చర్చగా ఉంది. ఏ సమస్య వచ్చినా అశోక్ పెద్దరికంతో పరిష్కరించేవారు. టీడీపీ అధినాయకత్వం తో నేరుగా సంబంధాలు ఉండేవి. ఇక తన వరకూ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రాలో వ్యవహారాలను చక్కబెట్టేవారు. ఇపుడు గవర్నర్ గా అశోక్ వెళ్తే కోట బోసిపోతోంది అని అంటున్నారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆమె ప్రజా జీవితానికి కొత్త. తండ్రికి ఉన్న రాజకీయ నేర్పు ఓర్పు ఆమెలో ఎంతవరకూ ఉన్నాయని ప్రశ్నలు వస్తున్నాయి. అశోక్ దాకా వచ్చిన రాజకీయ వారసత్వం ఇపుడు కుమార్తె చేతులలో ఉంది. దానిని మరింత కాలం ముందుకు తీసుకుని పోవాల్సి ఉందని అంటున్నారు. అయిత అశోక్ వ్యూహాలు లేని చోట కుమార్తె తనదైన ఆలోచనలతో ముందుకు సాగకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.