పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక హైటెన్షన్ గా మారుతోంది. ఈ ఎన్నికలో గెలుపు అధికార, విపక్షానికి అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం, సొంత మండలం కావడంతో జడ్పీటీసీ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీ నేతలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు సర్వశక్తులను ఉపయోగిస్తున్నాయి. దాడులు, దౌర్జన్యాలతో పులివెందులలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది. ఇక కొద్దిరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డిని బెదిరించారనే ఆరోపణలతో ఇద్దరు వైసీపీ కీలక నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డిని ఫోన్ లో బెదిరించారనే ఆరోపణలతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు శివశంకర్ రెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ ఇద్దరు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం బెయిలుపై హైదరాబాద్ లో ఉన్నారు. కోర్టు షరతులతో కూడిన బెయిలు ఇవ్వడం వల్ల వారిద్దరూ హైదరాబాద్ దాటి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో పులివెందుల స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అక్కడి నుంచే బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
కొద్దిరోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు విశ్వనాథరెడ్డి. అప్పటి నుంచి భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత గంగాధరరెడ్డి ఫోన్ లో బెదిరిస్తున్నారని విశ్వనాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్ డేటాను ఆధారంగా సమర్పించారు. దీంతో పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. రెండు, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.