ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ తీవ్ర తర్జనభర్జన పడుతోంది. తమ పెట్టని కోటలకు భీటలు వారడం, ప్రధానంగా ఎన్నికల కమిషన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఘోర ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని వైసీపీ భావిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నికల కమిషన్ వాటిని అడ్డుకుంటుందని, పోలింగు రోజు తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వైసీపీ ఆశించిందని చెబుతున్నారు. అయితే వైసీసీ ఆలోచనలను పూర్తి విరుద్ధంగా పరిస్థితులు నెలకొనడంతో ఘోర ఓటమి ఎదురైందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ఓటమికి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు ఒక కారణమైతే ఎన్నికల కమిషన్ నుంచి ఆశించిన సాయం అందలేదని రగిలిపోతున్నారు. తాము కోరి తెచ్చుకున్న కమిషన్ ఇలా వ్యవహరించడమేంటని అంతర్గతంగా కుమిలిపోతున్నారని అంటున్నారు
ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని రిటైర్ అయ్యాక ఎన్నికల కమిషనర్ అయ్యారు. అంతవరకు ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తో వైసీపీ తీవ్రంగా విసిగిపోవడంతో తాము చెప్పినట్లు పనిచేసే అధికారి కమిషన్ గా ఉండాలని కోరుకుందని నీలం సాహ్నిని నియమించారని అంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తాము చెప్పినట్లు విన్న కమిషన్ ఇప్పుడు ఆ స్థాయిలో సహకరించడం లేదని వైసీసీ నేతలు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను ఉదాహరణగా చెబుతున్నారు. ఈ రెండు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని తాము ఆధారాలతో ఫిర్యాదు చేసినా కమిషన్ పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూడటం వల్ల అధికార పార్టీ నేతలు మరింతగా రెచ్చిపోయారని వైసీపీ నేతలు రగిలిపోతున్నారు. తాము ఏరికోరి తెచ్చుకున్న ఎన్నికల కమిషన్ ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదని గుంటూరు జిల్లాకు చెందిన ఓ నేత బహిరంగ వ్యాఖ్యలు చేయడం విశేషంగా చెబుతున్నారు.
తాము ఒకటి ఆశిస్తే, అందుకు విరుద్ధంగా పరిస్థితులు మారిపోవడం, ఎన్నికల కమిషన్ నుంచి సహకారం లేకపోవడంతో చట్టబద్ధంగా పోరాడాలని వైసీపీ భావిస్తోంది. ముందుగా హైకోర్టులో ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రీపోలింగుకు ఆదేశించాలని పిటిషన్ వేసింది. అయితే ఎన్నికల కమిషన్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తయి ఫలితాలను ప్రకటించారు. మాజీ సీఎం జగన్ స్వస్థలంలో ఎదురైన ఓటమితో తీవ్రంగా కుంగిపోతున్న వైసీపీ.. అధికార పార్టీ అక్రమాలు చేసిందని ఆరోపిస్తూ అసలు సజావుగా ఎన్నికలు జరగలేదని అంటోంది. తమ వాదనకు మద్దతుగా ఎన్నికల కమిషన్ నుంచి పోలింగ్ నాటి వీడియో క్లిప్పులు ఇవ్వాలని దరఖాస్తు చేసిందని చెబుతున్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పక్క మండలాలు, నియోజకవర్గాలకు చెందిన వారు వచ్చి స్థానికుల పేరుతో ఓట్లు వేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. అయితే వీటిని మార్ఫింగ్ చేశారని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియోను టీడీపీ ప్రస్తావిస్తోంది. పశ్చిమబెంగాల్ వీడియోను తీసుకువచ్చి ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతోంది. అయితే తమ వాదన కరెక్ట్ అని నిరూపించుకోడానికి ఎన్నికల కమిషన్ రికార్డు చేసిన సమాచారం తెప్పించుకోవడం ఒకటే మార్గమని భావించిన వైసీపీ.. పోలింగుకు సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు చెబుతున్నారు.
పోలింగు జరుగుతున్నప్పుడు నమోదు చేసిన వెబ్ కాస్టింగు సమాచారంతోపాటు పోలింగ్ కేంద్రాల వెలుపల సీసీ కెమెరా రికార్డింగులు, పోలింగ్ అధికారి నమోదుచేసిన డైరీ, ఏజెంట్ల వివరాలు, ఫామ్-12, ఫామ్-32 వంటివాటిని ఇవ్వాలని కోరుతోంది. అయితే వైసీపీ ఇలా అడగడాన్ని గొంతెమ్మ కోర్కెలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని, ఎక్కడైనా అల్లర్లు, మూకదాడులు జరిగితే మీడియాలో వచ్చేది కదా? అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. వైసీపీకి సొంత మీడియా ఉన్నా, ఎక్కడా అల్లర్లు, అక్రమాలు జరిగినట్లు రికార్డు కాలేదని, ఎన్నికల కమిషన్ వీడియోల్లో కూడా ఇదే కనిపిస్తోందని అంటున్నారు. అయితే తమ ఓటమిని అంగీకరించని వైసీపీ, ఎన్నికల కమిషన్ నుంచి తీసుకున్న సమాచారంతో ఏం చేయనుందనేది ఉత్కంఠ రేపుతోంది.