అవును. పులివెందుల జెడ్పీటీసీ ఓటర్లు ఓటు అన్నది ఎరగరు. అంటే వారికి ఓటు హక్కు ఉంది కానీ పోలింగ్ బూత్ ల దాకా వచ్చి ఓటేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకు అంటే ఎన్నికలు జరగడం లేదు కాబట్టి. పులివెందుల జెడ్పీటీసీ అంటే ఎపుడూ ఏకగ్రీవంగానే జరిగిపోతాయి. తామంతా వైఎస్సార్ ఫ్యామిలీగా వారు చెప్పుకుంటారు. అందుకే అక్కడ ప్రత్యర్థులు కూడా నిలబడే సాహసం చేయరు. ఒకవేళ పోటీ చేసినా కూడా చివరి నిముషంలో డ్రాప్ అయిపోతారు. అంతలా కంచుకోట లాంటి పులివెందులలో ఇపుడు ఎన్నికల హడావుడి పీక్స్ లో ఉంది. వేడెక్కిపోతోంది అక్కడి రాజకీయం.
ఇక వెనక్కి వెళ్ళి చూస్తే పులివెందుల జెడ్పీటీసీ ఆనాటి నుంచి నేటి దాకా ఏకగ్రీవం అయి వైఎస్సార్ ఫ్యామిలికే కట్టుబడిపోయింది. 1995 నుంచి ఇదే తీరు అని చరిత్ర చెబుతోంది. అలాగే 2001, 2006లో కూడా అదే ఏకగ్రీవం జరిగింది. ఇక 2021లో అయితే జగన్ హయాంలో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికలు సాగాయి. అలాంటి చోట తొడగొట్టి మరీ సవాల్ చేసింది టీడీపీ. ఎన్నికలు పెట్టించింది. మేమే గెలుస్తామని అంటోంది.
వైసీపీ కుటుంబానికి వైసీపీకి ఇదే తొలి అనుభవం. తమకు వ్యతిరేకంగా పోటీ పడేవారు ఉండరన్న ధీమా ఆ పార్టీకి ఉండేది. కానీ మొదటి సారి అది చెదురుతోంది. పైగా పులివెందుల నుంచే ఏకంగా ఎనిమిది మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో పాటు అధికార టీడీపీ మొత్తం మోహరించింది. వైసీపీకి సొంత ఇలాకాలో దెబ్బ కొట్టి జెండా ఎగరేస్తే కడప విజయం సంపూర్ణం అవుతుంది అని భావిస్తోంది.
టీడీపీ కూటమి నాయకులు అంతా కసిగా పనిచేస్తున్నారు. ఇన్నాళ్ళూ ఓటు హక్కు లేని వారు ఇపుడు ఓటు వేయాలని అంటున్నారు. వైఎస్సార్ కుటుంబం ఏమి చేసింది అని ప్రశ్నిస్తున్నారు. తాము అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తున్నామని చెబుతున్నారు. తొలిసారి పులివెందులలో టీడీపీని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ జనలోకి టీడీపీ కూటమి దూసుకుని పోతోంది.
మరో వైపు చూస్తే అనూహ్యంగా ఈ ఎన్నికలు రావడంతో వైసీపీ పరిస్థితికి ఇది చావో రేవో అన్న సమస్యగా ఉంది. 2021లో వైసీపీ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి మరణంతో ఆయన కుమారుడు హేమంత్ రెడ్డిని బరిలోకి దించింది వైసీపీ. సానుభూతి మంత్రం కలసి వస్తుందని చూస్తోంది. అయితే అధికార బలంతో పాటు తగినన్ని వ్యూహాలతో టీడీపీ కూటమి దూకుడు చేస్తోంది. అనెక చోట్ల వైసీపీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటోంది. అర్ధ బలం అంగబలం అధికర బలం తోడు అయిన టీడీపీ కూటమి ఈ సీటుని ఎలాగైనా గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని పరిశ్రమిస్తోంది. దాంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కురుక్షేత్ర సంగ్రామాన్నే తలపిస్తోంది. చూడాలి మరి ఫలితం ఏ వైపున ఉంటుందో.