ఏపీ సీఎం చంద్రబాబు తన పాలనపై… ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గతంలో కొంత వరకే దీనిపై దృష్టి పెట్టగా.. తాజాగా మాత్రం ప్రతి వారం.. ప్రతి నెలా ఒక కార్యక్రమంగా పెట్టుకుని మరీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఐవీఆర్ ఎస్ ఫోన్ కాల్స్, నేరుగా ప్రజల నుంచి సమాచారం తెలుసుకోవడం.. వివిధ పత్రికల్లో వస్తున్న పాజిటివ్, నెగిటివ్ వార్తలను సంకలనం చేసి.. సంతృప్తి లెక్కలు వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో తాజాగా 16 మాసాల పాలనపై సేకరించిన లెక్కల ప్రకారం.. ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల 75 శాతం సంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించడం విశేషం. తాజాగా ఆయన అధికారులతో జరిపిన చర్చల్లో ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆకాంక్షలు పెట్టుకు న్నారని.. వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తాజా లెక్కల్లో 75 శాతం మంది కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని.. కానీ.. దీనిని 85 – 95 శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక, విభాగాల వారీగా చూస్తే.. రెండు శాఖలపై తప్ప.. మిగిలిన శాఖలపై ప్రజల నుంచి సంతృప్తి రికార్డు స్థాయిలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమ శాఖ విషయంలో ప్రజలు 90 శాతం సంతృప్తితో ఉన్నారని.. నెలనెలా అందుతున్న పింఛన్లు, ఇతర ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల సంతృప్తి .. గత రెండు మాసాలతో పోల్చుకుంటే .. ప్రస్తుతం మరింత పెరిగినట్టు తెలిపారు. ఇక, మద్యం పైనా ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకే అందిస్తున్నామన్నా రు. ఇది ప్రజల్లో పాజిటివిటీని పెంచినట్టు తెలిపారు.
అయినప్పటికీ.. ప్రజల సంతృప్తి స్థాయిలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. 85- 95 శాతానికి చేరితే తప్ప.. ఎన్నికల సమయానికి 80 శాతం స్టాండర్ట్‌గా నిలబడదని పేర్కొన్నారు. ఈ విషయంలో రియలటైమ్ గవర్నెన్స్(ఆర్‌టీజీఎస్) సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని బాధ్యతలు పూర్తిగా ఉన్నతాధికారులవేనని.. దీనిలో రాజకీయ నేతల జోక్యం ఉండదని కూడా చంద్రబాబు వివరించారు.












