గత 16 నెలల పాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ‘ఉత్తమ కార్యకర్తల సమావేశం’లో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు, దాడులను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి గౌరవించేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, “మన పార్టీలో ఓ జబ్బు ఉంది. మనం చేసిన మంచి పనులను కూడా సరిగా చెప్పుకోలేం. నాతో సహా అందరం ప్రజలకు ఏదో చేయాలనే తపనతో పనిచేస్తాం తప్ప, చేసింది ప్రచారం చేసుకోం. గతంలో అనంతపురం జిల్లాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కియా మోటార్స్ పరిశ్రమను తెచ్చినా, ఆ విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పలేకపోయాం. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాకూడదు” అని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 పింఛను, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క పింఛన్లకే ఏటా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.
పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలను గుర్తించి, జల్లెడ పట్టి నామినేటెడ్ పదవులు ఇస్తున్నామని లోకేశ్ భరోసా ఇచ్చారు. “పార్టీ సభ్యత్వం, ‘మన టీడీపీ’, ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారిని గుర్తిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. నామినేటెడ్ పదవుల్లో మొదటి రౌండ్ పూర్తయింది, మరో రౌండ్ ఉంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. నేను మర్చిపోయినా, చంద్రబాబు గారు మిమ్మల్ని మర్చిపోరు” అని ఆయన హామీ ఇచ్చారు. అయితే, కొందరు చిన్న చిన్న సమస్యలకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరైన పద్ధతి కాదని, పార్టీ అంతర్గత విషయాలను మనమే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. మన పోరాటమంతా రాజకీయ ప్రత్యర్థి వైసీపీతోనే ఉండాలని స్పష్టం చేశారు.
వైసీపీ తీరుపై లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “వైసీపీకి శవరాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. శ్రీకాకుళం గుడి ఘటనలో తొమ్మిది మంది చనిపోతే, ఆ విషాదాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. 94 ఏళ్ల పాండా వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఫేక్ ప్రచారం చేశారు. మన తెలుగు బిడ్డ, క్రికెటర్ శ్రీచరణి విషయంలోనూ కులాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గతంలో 32 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేశారు, కానీ వాస్తవానికి అందులో నలుగురే ఉన్నారని తేలింది. ఇలాంటి ఫేక్ ప్రచారాలను ప్రజల్లో ఎండగట్టాలి” అని పిలుపునిచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని, కానీ చంద్రబాబు సింహంలా ఒంటరిగా నిలబడి పోరాడారని గుర్తుచేశారు.
అధికారం వచ్చిందన్న గర్వం, అహంకారం వద్దని, మంత్రుల నుంచి కార్యకర్తల వరకు అందరూ టీమ్ వర్క్‌గా పనిచేయాలని లోకేశ్ సూచించారు. “గతంలో మనం పడిన కష్టాలను, నాపై పెట్టిన అట్రాసిటీ, మర్డర్ కేసులు, చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టిన సంగతి మరువద్దు. ఎర్రబుక్కును ఎగతాళి చేసిన వారి పరిస్థితి ఏమైందో చూశారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 12 లక్షల కోట్ల అప్పుతో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కూటమిలోని జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వానికి బేషరతుగా మద్దతిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
















