రాజకీయాల్లో హత్యలు ఉండవు.. అన్నీ ఆత్మహత్యలే అంటారు పొలిటికల్ అనలిస్టులు.. నిజమే, రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలే ఎవరు రాజు అవుతారనేది నిర్ణయిస్తాయి. సరైన వ్యూహం లేని వారు పరాజితులుగా మిగిలిపోవాల్సిందే.. దీనికి మన జాతీయ రాజకీయాలు ఉదాహరిస్తున్నారు. ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలతో ప్రధాని మోదీ అపర చాణక్యుడిగా నిత్య విజుయుడుగా వర్ధిల్లుతున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రధాని మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన 2014 నుంచి చూస్తే.. కాంగ్రెస్ వైఫల్యాలే మోదీ విజయసోపానాలుగా మారాయని అంటున్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవం ప్రధాని మోదీ వ్యూహాత్మక విజయంగా అభివర్ణిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ విస్మరించిన ఈ అవకాశాన్ని ప్రధాని అందిపుచ్చుకుని ప్రజల్లో జాతీయ భావోద్వేగాన్ని తట్టిలేపారని, ఆ విధంగా తనను తానే సాటిగా నిరూపించుకున్నారని ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు.. జాతీయ రాజకీయాల్లో మోదీ శకం ప్రారంభమైన నుంచి అనేక అంశాల్లో కాంగ్రెస్ బ్రాండ్ ను చెరిపేసి తన ఇమేజ్ పెంచుకుంటున్నారని అంటున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, కస్తూరి ఠాకూర్, ప్రణబ్ ముఖర్జీ ఇలా కాంగ్రెస్ తో దశాబ్దాల అనుబంధం ఉన్నవారితో ప్రధాని మోదీ రాజకీయ లబ్ధి పొందుతున్నారని విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విషయంలో బీజేపీ వ్యూహం జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఎంతో ఉపకరించిందని అంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉక్కు మనిషి పటేల్ కు దేశంలో ఎందరో అభిమానులు ఉన్నారు. తొలి హోంమంత్రిగా ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఇప్పుడు దేశం పటిస్టంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ విస్మరించదని ఎత్తిచూపడంలో మోదీ సక్సెస్ అయ్యారు. మోదీ నేతృత్వంలో గుజరాత్ లో ఎత్తైన పటేల్ విగ్రహం నిర్మించారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం కావడంతో పటేల్ కు ఎంతో గౌరవం ఇచ్చినట్లు అయింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల గుజరాత్ లో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. తద్వారా ఉత్తరాదిలో బలమైన పార్టీగా అవతరించిందని అంటున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విషయంలో బీజేపీ, మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ పావులు కదిపారని అంటున్నారు. గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. బెంగాల్ వాసుల మనసు దోచుకుందని విశ్లేషిస్తున్నారు. బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సీఎం మమతా బెనర్జీని ఓటమి అంచుల వరకు బీజేపీ తీసుకెళ్లగలిగిందనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో బిహార్ లో కూడా ప్రధాని మోదీ ఇదే వ్యూహాన్ని అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జన నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న అవార్డు ప్రకటించారు. ఈబీసీల నాయకుడిగా ప్రజల మనిషిగా గుర్తింపు ఉన్న కర్పూరి ఠాకూర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ప్రధాని మోదీ వాడుకున్నారని అంటున్నారు. ఇప్పుడు వందేమాతరం గేయం విషయంలో కూడా ప్రధాని మోదీ క్రెడిట్ కొట్టేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వందేమాతరం గేయాన్ని జాతీయ గీతంగా చేయగలిగిన కాంగ్రెస్.. ఇప్పుడు అచేతనంగా ఉండిపోవాల్సి రావడం సరైన వ్యూహలేకపోవడం వల్లేనని అంటున్నారు.
















