రాజకీయ సభ అయినా, సినిమా ఈవెంట్ అయినా అది ఏదైనా సరే అది సక్సెస్ కావాలంటే సాధారణ జనం ఉండాల్సిందే. ఒక హీరో స్టార్ అవుతున్నారు అంటే సాధారణ జనమే ఉంటారు. వారేదో కట్టెలు కొట్టి, మొద్దులు మోసి ఆ పేరు సంపాదించుకోరు. ఒక లీడర్ ఎదుగుతున్నాడు అంటే సాధారణ కార్యకర్త ఫ్లెక్సీ కడతాడు, ర్యాలీ చేస్తాడు, చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇలా ఎవరు ఏ విధంగా ఎదిగినా దాని వెనక ఉండేది సాధారణ ప్రజలు మాత్రమే.. ఇలా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆస్తుల పరంగా, పేరుపరంగా, అంతస్తు పరంగా, పెద్దవాళ్లను చేస్తూ చివరికి పేదలు బలైపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మరి ఇంత జరిగినా ఈ బడా వ్యక్తులు, పేదలకు ఏమైనా న్యాయం చేస్తున్నారా అంటే అది లేదు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ సినిమా సభలకు సంబంధించి ఏ ర్యాలీ నిర్వహించినా సభలు పెట్టినా తొక్కిసలాటల్లో ఎంతో మంది మరణించారు.. అయితే తాజాగా తమిళనాడు ఘటనలో చాలామంది తొక్కిసలాటలో మరణించడంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనమైంది. తమిళనాడు హీరో రాజకీయ నాయకుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి ఇప్పటికే సభలు సమావేశాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా అయిన 10,000 మందికి పర్మిషన్ తీసుకొని లక్షలాదిమందితో ర్యాలీ నిర్వహించారు. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది సాధారణ ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాల పాలై చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పొలిటికల్ ఈవెంట్లలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటి సారి అనుకోవచ్చు.
ఇలా రాజకీయ సభలే కాకుండా మొన్నటికి మొన్న క్రికెట్ కి సంబంధించి ఆర్సిబి కప్పు గెలిచిన ఆనందంలో పరేడ్ ర్యాలీ లో లక్షలాదిమంది పాల్గొని అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. అంతేకాకుండా పుష్ప2 ప్రీమియర్స్ కి సంబంధించి రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా ఆమె కొడుకు తీవ్రంగా గాయాల పాలయ్యారు.. ఇలా ఏ ఈవెంట్ జరిగినా సాధారణ ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలవడం తేలికైపోయింది. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది మేధావులు స్పందిస్తూ మామూలు ప్రజలు అంటే అసలు ఈ నాయకులకు హీరోలకు లెక్కలేదా.. వీళ్లవైనా ప్రాణాలే, వాళ్లవైనా ప్రాణాలే కదా.. నాయకుల యొక్క బలప్రదర్శన చూపించుకోవడానికి ఇలా సభలు పెట్టి పేదల ప్రాణాలు తీస్తూ వాళ్ళు ఎదుగుతున్నారు..
చివరికి పోలీసులు వైఫల్యం చెందారని దానివల్ల అంత మంది చనిపోయారని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.. నిజం చెప్పాలంటే సాధారణ జనాలకు తెలివి ఉండాలి.. ఒక సభకు మనం వెళ్తున్నామంటే మనతోపాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం. చివరికి మీరు అక్కడ ప్రాణాలు కోల్పోతే మీ పిల్లలు ఏమైపోవాలి కుటుంబం ఏమైపోవాలి. ఒక హీరోను లేదా రాజకీయ, నాయకుడిని చూడడానికి అంత ఆత్రం అవసరం లేదు.. మీ ప్రాణాలు పోతే ఆ హీరో ఆ నాయకుడు వచ్చి మీ కుటుంబాన్ని సాకడు కదా.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాధారణ జనం ఇంట్లో ఉండడం మంచిదనేది మేధావులు చెబుతున్నారు.
తమిళనాడు స్టార్ విజయ్ టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించారు. ఈ తొక్కీసలాట జరగడంతో అక్కడినుండి స్పెషల్ ఫ్లైట్ లో విజయ్ తన ఇంటికి చేరుకున్నారు.కానీ మృతుల సంఖ్య ఒక్కొక్కరిగా పెరుగుతూనే ఉంది.కేవలం అర్ధగంటలోనే 41 మంది మరణించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ కాబట్టి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఇంత మంది చనిపోవడానికి కారణమైన విజయ్ ని అరెస్ట్ చేస్తారా అని.. టీవీకే పార్టీ ర్యాలీని నిర్వహించుకుంటామని పోలీసుల దగ్గర పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నారట విజయ్.కానీ ఒక్కసారిగా అక్కడికి దాదాపు రెండు లక్షల మంది రావడంతో ఈ ఘోరం జరిగింది.
అయితే పుష్ప-2 విడుదల సమయంలో అల్లు అర్జున్ బహిరంగ ర్యాలీ చేసిన సమయంలో ఒక మహిళ ప్రాణాలు పోయి ఆ మహిళ కొడుకు తీవ్ర గాయాలపాలైన సమయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఒక్కరి ప్రాణాలకే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు ఇంతమంది ప్రాణాలను బలిగొన్న విజయ్ ని అరెస్టు చేయరా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందితే ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది విజయే కదా..విజయ్ ని జైలో వేయాల్సిందే కదా అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు.. మరి విజయ్ ని కూడా తమిళనాడు పోలీస్ అరెస్ట్ చేస్తారా అనేది చూస్తే అరెస్టు చేయరు కావచ్చు అని తెలుస్తుంది.ఎందుకంటే అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ లేకుండానే తన సినిమా హిట్ అయిన ఆనందంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు కానీ విజయ్ మాత్రం పదివేల మందికి అనుమతి తీసుకున్నారు.
కానీ అనూహ్యంగా అక్కడికి ఎక్కువమంది వచ్చారు. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగింది.విజయ్ అనుమతి తీసుకున్నారు కాబట్టి ఆయన్ని అరెస్టు చేయరనే వార్తలే వినిపిస్తున్నాయి. కానీ అరెస్టు చేయకపోయినప్పటికీ తమిళనాడు ప్రజల నుండి మాత్రం ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే కనీసం విజయ్ హాస్పిటల్ కి వెళ్లి మృతి చెందిన వారి కుటుంబాలను తీవ్రగాయాలతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వారిని పరామర్శించకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. దీంతో ఈయన తీరుపై చాలామంది విమర్శలు చేస్తున్నారు.కష్ట సమయంలో దగ్గరే ఉండి వారి బాగోగులు చూసుకోవాల్సింది పోయి ఏమి పట్టనట్లు ఇంటికి వెళ్లిపోయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. నా గుండె పగిలిపోయింది.
నా ప్రాణం విలవిలాడుతోంది. చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక విజయ్ ని అరెస్ట్ చేస్తారా అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని మీడియా ప్రశ్నించగా..బయట వచ్చే ఊహగానాలన్నింటికి నేను సమాధానం చెప్పలేను. ఈ ఘటనపై రాజకీయ వ్యాఖ్యలు చేయలేను.ఏదైనా సరే విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాము..అంటూ తెలిపారు. అలాగే హాస్పిటల్లో తీవ్ర గాయాలపై చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు చనిపోయిన మృతుల కుటుంబాలకు 10 లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.