ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేసినా లెక్కలు వేసుకుంటారు. నివేదికలు రెడీ చేసుకుంటారు. ప్రతి పనికీ హోం వర్క్ చేసుకుంటారు. ఇలా.. ఆయన అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పక్కాలెక్కలతోనే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదేసమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. వారిని తాను అలెర్ట్ చేస్తున్న విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎంగా ప్రస్తుతం చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. పెట్టుబడుల కల్పన, కంపెనీలతో మాట్లాడడం, సూపర్ సిక్స్‌ను అమలు చేయడం.. మరోవైపు గిల్లికజ్జాలు పెట్టుకునే నాయకులను లైన్‌లో పెట్టడం.. ఇలా అనేక విషయాలతో ఆయన క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. అయినప్పటికీ.. పార్టీ పరంగా.. శ్రద్ధ తీసుకుంటున్నారు. నాయకులతో మాట్లాడడం.. ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం.. ఇలా అనేక విషయాలను వారితో చర్చిస్తున్నారు.
దీనికి సంబంధించి చంద్రబాబు తాజాగా కొన్ని అంకెలు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీ కోసం తాను ఎన్నిసార్లు నాయకులను కలుసుకున్నదీ.. పార్టీ కార్యాలయానికి వచ్చింది కూ డా చెప్పుకొచ్చారు. ఈ 18 మాసాల కాలంలో ఏకంగా 130 సార్లు టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. వీటిలో మండల, జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి చర్చలు చేపట్టారు. ముఖ్యంగా పార్టీ తరఫున కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
42 సార్లు.. నాయకులతో మాట్లాడారు. వివిధ నియోజకవర్గాల నుంచి నాయకులను పిలుచుకుని అమరావ తిలో ప్రత్యేకంగా జరిపిన చర్చలు, నియోజకవర్గాల స్థాయిలో ఉన్న విభేదాలపై చర్చించారు. 53 సార్లు.. యువతతో భేటీ అయ్యారు. నియోజకవర్గాలు, జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు.. స్థానిక టీడీపీ యువతతో 53 సార్లు సీఎం చర్చలు జరిపారు. వీటిలో దాదాపు 100 నియోజకవర్గాలు ఉన్నాయని పార్టీ కార్యాలయం తెలిపింది. ఇక, సీఎంగా ఉంటూ.. టీడీపీ కేంద్ర కార్యాలయానికి నాలుగు సార్లు వచ్చారు. ఇలా.. చంద్రబాబు పార్టీ పరంగా ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారన్నది ఆయన స్వయంగా నివేదిక రూపంలో పొందుపరచడం గమనార్హం.

















