సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరై, తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న హరీష్ రావును ఓదార్చారు. హరీష్ రావు తల్లి, కేసీఆర్ సోదరి కావడంతో ఆమెను కూడా పరామర్శించారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ కీలక నాయకులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అయితే, ఆ సమయంలో జాగృతి సంస్థాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా సంతాపం తెలిపినా, అది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కవిత వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో గురువారం కవిత సడెన్ గా హరీష్ రావు నివాసం కోకాపేటకు వెళ్లి, ఆయన తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమెతో పాటు భర్త అనిల్ రావు కూడా ఉన్నారు. ఈ పరిణామం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. జాగృతి వర్గాల్లో కూడా కవిత వెళ్లబోతున్నారన్న సమాచారం కొద్ది మందికే తెలిసినట్టు తెలుస్తోంది. ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇటీవల కాలంలో కవిత , హరీష్ రావుల మధ్య రాజకీయ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కవిత, కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో హరీష్ రావు పేరును లాగగా, సోదరుడు సంతోష్ రావు టానిక్ కేసు విషయాన్ని కూడా బయటపెట్టారు. దీంతో ఈ ఇద్దరి మధ్య గాఢమైన విభేదాలు చెలరేగాయి.
అలాంటి సమయంలో కవిత వ్యక్తిగతంగా హరీష్ రావును పరామర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, హరీష్ రావు మాత్రం ఆ సానుభూతిని పెద్దగా పట్టించుకోలేదని, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే స్పందించారని సమాచారం. కవిత నమస్కారం చేయగా ఆయన ప్రతినమస్కారం చేసినట్లు చెబుతున్నారు.
కవిత పెద్దగా సంభాషణకు దిగకుండానే నివాళులు అర్పించి, కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయారు. పాత పగలు పక్కనపెట్టి కవిత హరీష్ రావును పరామర్శించడం రాజకీయ సమీకరణల్లో కొత్త మార్పులకు నాంది కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే హరీష్ రావు స్పందన తటస్థంగా ఉండటంతో ఈ పరిణామం భవిష్యత్తులో ఏ దిశగా దారి తీస్తుందో చూడాలి.
 
			



















