కేంద్రంలో వరసగా మూడోసారి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. ఈసారి ఆయన మిత్రుల అండతో పీఠం అధిష్టించారు. అయితే తొలినాళ్ళలో చూస్తే కనుక బీజేపీకి మిత్రుల విషయంలో కొన్ని సంశయాలు ఉన్నాయని ప్రచారం సాగింది. ఇక అయిదేళ్ల పాటు సాగే ప్రభుత్వం ఇది కాదని కూడా ఇండియా కూటమి ప్రచారం చేసింది. దానికి తోడు అన్నట్లుగా ఎన్డీయే పెద్దలు కూడా జమిలి ఎన్నికలు అని అంటూ వచ్చారు. అంటే సొంతంగా మెజారిటీ సాధించడమే బీజేపీ ఆలోచన దీని వెనక ఉందని అంతా విశ్లేషించారు. దీనికి కారణం ఊత కర్రల ఆసరాతో బీజేపీ ప్రభుత్వం నడపడం కాషాయ పెద్దలకే అంతగా ఇష్టం లేదని అనుకున్నారు. అదే విధంగా చూస్తే మిత్రులు గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీకి దూరం కావడం వల్ల కూడా ఆ డౌట్లూ అలా ఉంటూ వచ్చాయని అంటారు.
ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపుగా ఒకేసారి జరిగాయి. ఈసారి బీజేపీ పెద్దలతో బాబు సాన్నిహిత్యం మామూలుగా లేదు, ఆయన ప్రియ మిత్రుడిగా మారిపోయారు. అంతే కాదు కేంద్ర పెద్దల వైఖరిలో కూడా బాగా మార్పు వచ్చింది అని గుర్తు చేస్తున్నారు. బాబుకి ఏపీ డెవలప్మెంట్ మీద ఉన్న కమిట్మెంట్ ఆయన జాతీయ రాజకీయాల మీద పెద్దగా ఫోకస్ చేయకపోవడం తన వారసుడిని రెడీ చేసే పనిలో ఉండడం ఈసారి తనకు దక్కిన అవకాశంతో ఏపీకి చిరస్థాయిగా మేలు చేసి చరిత్రలో తన పేరుని శాశ్వతం చేసుకోవాలని తాపత్రయపడటం వంటివి చూసిన కేంద్ర పెద్దలు బాబు మీద పూర్తిగా నమ్మకాన్ని పెంచుకున్నారని అంటున్నారు. అంతే కాదు బాబు లోకేష్ కూడా బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో అత్యంత నమ్మకమైన మిత్రుడిగా బాబు బీజేపీ పెద్దలకు ఇపుడు కనిపిస్తున్నారు అని అంటున్నారు.
ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఏపీకి ఏ విషయంలో సాయం చేయాలని అనుకున్నా ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు, బాబు నుంచి ప్రతిపాదనలు వెళ్తే ఆ వెంటనే ఆమోదించడం జరిగిపోతోంది. ఏపీకి వరసబెట్టి పరిశ్రమలు ఈసారి వస్తున్నాయి. దీని వెనక కేంద్ర సహకారం కూడా ఉంది అని అంటున్నారు. అలాగే ఏపీలో రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి ఇతర ఏజెన్సీల నుంచి ఆర్ధికంగా సాయం చేయడం వెనక కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది అన్నది తెలిసిందే. వీలైనంత వరకూ కేంద్ర పధకాల విషయంలో కానీ ఇతరత్రా సాయం విషయంలో కానీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా చేస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం ఏపీలో టీడీపీ కూటమి ఎంత బాగా ప్రజాదరణ పొందితే అంతగా తాము కూడా కేంద్రంలో లాభపడవచ్చు అన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.
ఇక బీజేపీ గతంలో బాబును మిత్రుడిగా ఉంచుకుంటూనే ఏపీలో జగన్ తో కూడా పరోక్ష స్నేహం చేస్తూ వచ్చింది. దానికి కారణం ప్లాన్ బీని రెడీ చేసుకోవడానికే అని అంటున్నారు. నిజానికి 2018లో బీజేపీ నుంచి ఎన్డీయే నుంచి టీడీపీ వేరు పడడానికి కారణం వైసీపీతో పరోక్ష బంధానికి కాషాయం పార్టీ పెద్దలు ప్రయత్నం చేయడమే అని అంటారు. ఇపుడు అటువంటి పరిస్థితి లేకుండా టీడీ ఆ గ్యాప్ ని భర్తీ చేస్తోంది. ఏ మాత్రం స్కోప్ కూడా ఇవ్వడం లేదు, దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో సైతం లేని విధంగా కేంద్ర ప్రభుత్వ పధకాల గురించి కానీ జీఎస్టీ ప్రచారం గురించి కానీ ఏపీ ప్రభుత్వమే ముందుకు వచ్చి ఘనంగా నిర్వహిస్తోంది. అలాగే అంతర్జాతీయ యోగాని ఏపీలో ఘనంగా నిర్వహించి కేంద్ర పెద్దల మన్ననలు అందుకుంది. దాంతో వచ్చే ఎన్నికల తరువాత కూడా టీడీపీ బంధం కొనసాగుతుంది అన్న నిబ్బరం అయితే కాషాయ దళంలో బగంగా వచ్చింది అని అంటున్నారు.
ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ కి బీజేపీతో పరోక్ష బంధం నెరిపేందుకు అవకాశాలు ఏ మాత్రం లేకుండా పోతున్నాయని అంటున్నారు. ఇక వైసీపీ వరకూ చూస్తే ఆ పార్టీ పొత్తు పెట్టుకోదు, సీట్లు ఇవ్వదు, అదే టీడీపీతో పొత్తు ఉంటే సీట్లు దక్కుతాయి. బలం కూడా పెరుగుతుంది, అంతే కాదు టీడీపీ బీజేపీ ల ఫిలాసఫీ దాదాపుగా కలుస్తుంది అని అంటున్నారు. దాంతో 2014 మాదిరిగా జగన్ వైపు కేంద్రం ఇక మీదట చూసే అవకాశాలు పెద్దగా లేవని అంటున్నారు. దాంతో వైసీపీ ఏపీలో మాత్రం ఒంటరిగానే మిగిలిపోతోంది అని అంటున్నారు. బీజేపీ టీడీపీల మధ్య ఈసారి పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ కూడా ఉండడం ఈ బంధాన్ని మరింతగా గట్టి పరిస్తున్న వేళ వైసీపీ తన ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడానికి తన భవిష్యత్తు రాజకీయం కోసం జాతీయ స్థాయిలో కొత్త ఆలోచనలు చేయాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.