కంచె చేను మేసింది.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే రాక్షసులుగా మారిన పరిస్థితి నెలకొంది! మహిళలకు, యువతులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే కామాంధులుగా మారి వారిని కాటేసిన ఘటన కలకలం రేపుతోంది! ఈ దారుణ ఘటన తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రాంతమైన తిరువణ్ణామలైలో జరిగింది.
అవును… స్థానిక మీడియా కథనాల ప్రకారం… సెప్టెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లీకూతుళ్లు తిరువణ్ణామలై వెళుతున్న ఒక గూడ్స్ వాహనంలో ఎక్కారు. వాహనం రాత్రి సమయానికి ఎంథాల్ బైపాస్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో బైపాస్ పై పెట్రోలింగ్ చేస్తున్న సురేశ్ రాజ్, సుందర్ రాజ్ అనే ఇద్దరు పోలీసులు వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయాలని చెప్పారు.
దీంతో వాహనంలోని తల్లీకూతురు కిందకు దిగారు. ఈ క్రమంలో ఆ గూడ్స్ వాహనం డ్రైవర్ పారిపోయాడు. దీంతో తల్లీకూతురు అక్కడే ఉండిపోయారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. తిరువణ్ణామలై దేవస్థానానికి వెళ్తున్నట్టు వారు తెలిపారు. అయితే తమ వాహనం మీద తీసుకెళ్తామని వారికి మాయ మాటలు చెప్పి విల్లుపురం రోడ్డుకు తీసుకెళ్లారు.
అక్కడే ఓ కానిస్టేబుల్.. తల్లిని ముళ్లపొదల్లోకి నెట్టివేయగా, మరో కానిస్టేబుల్ యువతిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతలో తల్లి తేరుకుని స్థానికంగా ఉన్న ఇటుక బట్టీల ప్రాంతానికి వెళ్లి, అక్కడున్నవారికి జరిగిన విషయం చెప్పగా వాళ్లు 108కు ఫోన్ చేశారు.
ఈ క్రమంలో ఆమె కూతురు పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను అక్కడికి చేర్చారు. దీంతో ఇద్దర్నీ అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు పోలీసులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు అరెస్ట్ చేశారు.