ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం జాతీయంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు కొంత ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఎంతో మంచి దోస్త్ అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ స్థాయిలో తన భారత్ వ్యతిరేకతను బయటపెట్టుకుంటారని ఎవరూ అనుకోలేదు. హౌడీ మోడీ నమస్తే ట్రంప్ అన్న కార్యక్రమాలను చూసిన వారు అసలు ఊహించలేదు. ఇపుడు అంతర్జాతీయంగా భారత్ విధానాలు ఒక లెక్కకు రావాల్సి ఉంది. జాతీయంగా చూస్తే 2024లో ప్రధాని అయ్యాక మోడీ కొంత ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బీజేపీకి మెజారిటీ దక్కలేదు. దాంతో రెండు పార్టీల మీద ఆధారపడడం అన్నది రాజకీయంగా సవాల్ అని అంటున్నారు
ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నది మోడీని పెంచి పోషించింది. అలాంటి సంఘ్ ఇపుడు సూచిస్తోంది. ఒక విధంగా శాసిస్తోంది. 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని గట్టిగానే గద్దిస్తోంది. ఇదంతా మోడీని ఉద్దేశించే అన్నది కూడా ఉంది. సంఘ్ తో ఉన్న కొంత గ్యాప్ ని తగ్గించుకునే ప్రయత్నాలు ఇటీవల కాలంలో చేస్తున్నప్పటికీ అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయో అన్నది చూడాలని అంటున్నారు.
ఇక కేవలం నెల కూడా లేదు. మోడీ 75 ఏళ్ళు నిండి 76వ ఏటిలోకి అడుగు పెట్టడానికి. సెప్టెంబర్ 17తో ఆయన వజ్రోత్సవ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. మరి సంఘ్ చెప్పినట్లుగా మోడీ రాజీనామా చేస్తారా. ఇంకా తన చేతిలో మూడున్నరేళ్ళకు పైగా ఉన్న అధికారాన్ని పదవిని ఆయన స్వచ్చందంగా వదులుకుంటారా అన్నదే ఇక్కడ కీలకమైన చర్చగా ఉంది. దీనికి జవాబు అయితే ప్రస్తుతానికి ఎవరి వద్దా లేదు.
దేశంలో పెద్ద రాష్ట్రాలలో ఒకటిగా ఉంటూ హిందీ బెల్ట్ లో కీలకమైన బీహార్ లో శాసనసభకు ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్నాయి. నిండా అయిదేళ్ళు పూర్తి చేసుకున్న ఎన్డీయే పాలన మీద జనాలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎన్డీయేలో బీజేపీ ఉన్నా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ చాలా కాలంగా పాలన చేస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలంగా బీహార్ సీఎం గా ఉన్నారు ఆయన కనుక వద్దు అనుకుంటే ఫలితాలు చాలానే మారుతాయి. ఇదే ఇపుడు బీజేపీలోనూ ఉన్న భయం ఆయనను కాదని బీజేపీ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టడానికి సాహసించినా అసలుకే ఎసరు వస్తుంది అన్న కంగారు ఉంది ఎందుకంటే జేడీయూ ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాంతో బీజేపీకి ఈ ఎన్నికలను ఫేస్ చేయడం ఒక పరీక్షగానే ఉంది అని అంటున్నారు.
బీహార్ ఎన్నికల్లో బీజేపీ కీలకంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఓడితే ఏమి జరుగుతుంది అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎండీయే ప్రభుత్వానికి వెంటనే ముప్పు లేకపోయినా మెల్లగా ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు. మాజీ సీఎంగా నితీష్ కుమార్ ఊరకే ఉండరని ఒక విశ్లేషణగా ఉంది. అంతే కాదు మోడీ ఇమేజ్ తగ్గిందని సంకేతాలు వస్తే కనుక మరో మిత్ర పక్షం టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నది మరో విశ్లేషణ. మొత్తం మీద మోడీకి ముందు ముందు అనేక సవాళ్ళు అయితే పొంచి ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.