దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తున్నారు అంటే ఎన్నో ఆశలు ఉంటాయి, మరెన్నో ఆకాంక్షలు ఉంటాయి, దాదాపుగా యాభై లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కేంద్రాన్ని నడిపిస్తున్న ప్రభుత్వ సారధి తమ రాష్ట్రానికి కూడా ఎంతో ఇస్తారని ఎంతో చేస్తారని అంతా భావిస్తారు. ఇక మోడీ ఏపీకి ఇదే ఏడాదిలో నాలుగు సార్లు వచ్చారు. అంటే ఆయన హ్యాట్రిక్ పీఎం గా ప్రమాణం చేసిన తర్వాత అన్న మాట. ఈ ఏడాది జనవరిలో విశాఖ వచ్చారు, అలాగే ఏప్రిల్ లో అమరావతికి వచ్చారు, ఇక మళ్ళీ విశాఖకు జూన్ లో వచ్చారు, ఇపుడు కర్నూల్ కి వచ్చి వెళ్ళారు. మోడీ ఏపీకి వచ్చి వెళ్ళినందుకు అయిన ఖర్చు ఎంత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తున్న సాయం ఎంత అన్నది మరో సారి వాడిగా వేడిగా చర్చ సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఒక్కసారి వచ్చి వెళ్ళడానికి ఏపీలో బీజేపీతో భాగస్వామ్యం కలిగిన కూటమి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు చూస్తే అధికంగా ఉంటుందనే చెబుతున్నారు. మరి ఖర్చుకు తగిన విధంగా కేంద్రం ఇచ్చే సాయం కానీ చూస్తేనే బ్యాలెన్స్ షీట్ ఓకేగా ఉంటుంది, ఆ విధంగా జరిగిందా అన్నదే చర్చగా ఉంది. మోడీ ఏపీకి ఎపుడు వచ్చినా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు. అయితే వాటిలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయని కామ్రేడ్స్ అంటున్నారు. స్థూలంగా లెక్క తీస్తే ఏపీకి ఎంత ఇచ్చారు ఏమి చేశారు అన్నదే ముఖ్యం కదా అని వారు అంటున్నారు.
రాయలసీమ డిక్లరేషన్ అని బీజేపీ 2018లో పెద్ద సభ పెట్టి మరీ గర్జించింది. సీమకు ఏకంగా 20 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ కావాలని కూడా డిమాండ్ చేసింది. మరి ప్రధాని సాక్షాత్తూ సీమకే వచ్చారు. కర్నూల్ వేదికగా ఆయన ప్రసంగించి వెళ్లారు, అందులో సీమ డిక్లరేషన్ ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. డిక్లరేషన్ మాట పక్కన పెడితే విభజన హామీలకే దిక్కు లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు తప్పించి అక్కడ ఒరిగేది లేదని అలాగే కర్నూల్ లో టెక్స్ టైల్ పార్క్ కానీ రైల్వే వేగన్ల తయారీ కర్మాగారం కానీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ అత్యంత వెంకబాటుకు గురి అయిన ప్రాంతమని అలాంటి చోటకు వచ్చిన ప్రధాని శాశ్వతమైన ప్రాజెక్టులను ఏమి ప్రకటించాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చూస్తే కర్నూల్ వేదికగా మోడీ శంకుస్థాపనలు చేసిన పదమూడు వేల కోట్ల ప్రాజెక్టులలో అత్యధికం ఇతర రాష్ట్రాలవి ఉన్నాయని కూడా గుర్తు చేశారు.
అమెరికా భారత్ మీద యాభై శాతం అధిక సుంకాలు విధించినపుడు ఆత్మ నిర్భర్ భారత్ అని నినదించిన ప్రధాని ఇపుడు అమెరికా గూగుల్ ని దిగుమతి చేసుకుంటూ అదే గొప్ప అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా ఉద్యోగాలు పెద్దగా ఇచ్చేది కాదని ఆయన విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 22 వేల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించి గూగుల్ పెట్టుబడులలో పాతిక శాతం ముందే ప్రభుత్వాలు ఇచ్చేశాయని ఆయన ఫైర్ అయ్యారు గూగుల్ డేటా సెంటర్ వల్ల కాలుష్యం అధిక వేడిమితో నీటి కొరతతో విశాఖ భవిష్యత్తు ఏమి అవుతుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ సారీ మోడీ ఏపీకి వచ్చినపుడు బాబు పవన్ లోకేష్ ఆయనను పొగుడుతారని, అటు వైపు నుంచి మోడీ వీరిని పొగుడుతారని ఇంతకు మించి ఏపీకి ఏమైనా దక్కుతోందా అని ఆయన ప్రశ్నించారు. అప్పులు కాదు అభివృద్ధి చూపించాలని ఆయన కోరారు. కానీ మోడీ పర్యటనల వల్ల ఖర్చు తప్ప నిఖార్సు అయిన అభివృద్ధి ప్రాజెక్టులు ఏపీకి ఎందుకు రావడం లేదని కామ్రేడ్స్ నిలదీత కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.