గన్ మెన్లు అంటే అధికార హోదాకు నిదర్శనం. ఆయనకు ఆ హోదా దక్కింది. అసలే రాజు, మంత్రి కావల్సిన వారు అని అనుచరులు అభిమానులు ఆశిస్తూంటారు. కానీ అధికారంలోకి సొంత పార్టీ వచ్చినా ఏమీ కాకుండా మిగిలిపోతున్నారు అన్న బాధను సైతం వారు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక పదిహేను నెలల ఆరాటాలు పోరాటాలు ఆశలు నిరాశల మధ్య ఎట్టకేలకు పిఠాపురం వర్మ జాతకంలో రాజయోగం కనిపిస్తోంది అని అంటున్నారు.
ప్రస్తుతానికి అయితే వర్మకు అర్జంటుగా ఇద్దరు గన్ మెన్లు జత చేరారు. వారు వర్మ వస్తూంటే ముందుంటారు. అది ఒక అధికార దర్జా. వర్మకు నిజానికి ప్రాణ భయం ఏమీ లేదని అంటున్నారు. అలాగని ఎవరి నుంచి బెదిరింపులు కానీ ముప్పు కానీ అంతకంటే లేవని చెబుతున్నారు మరి ఏమీ లేకుండా ఇంటలిజెన్స్ నివేదికలు సైతం అవసరం లేదని అంటున్నా ఎందుకు ఈ గన్ మెన్లను ఇచ్చారు అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే చాలానే మ్యాటర్ ఉంది అక్కడ అని కూడా అంటున్నారు.
వర్మ అలాంటి ఇలాంటి త్యాగం చేయలేదు. అయిదేళ్ళ పాటు వైసీపీ హయాంలో వారిని ఎదిరించి పోరాడారు. జనంలో ఉంటూ కలియతిరిగారు. టీడీపీ వారికి అండగా నిలబడ్డారు. వైసీపీ ఊపు మీద ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఏ ప్రలోభాలకు లోంగలేదు. అలా పక్కాగా గెలిచే సీటు పిఠాపురం అని అంతా అనుకునేలా చేశారు. తీరా అన్ని సమకూర్చుకుని విస్తరిలో భోజనానికి కూర్చోబోయే వేళ పొత్తుల పేరుతో ఆయన విస్తరిని లాక్కున్నారు. అది కాస్తా వర్మకు చేజారింది. ఇక 2024లో వర్మకు టికెట్ ఇస్తే ఏమి జరిగేదో అందరికీ తెలిసిందే. దర్జాగా ఆయన రెండవ మారు ఎమ్మెల్యే అయి ఉండేవారు, క్షత్రియుల కోటాలో మంత్రి పదవిని సైతం అందుకునేవారు. కానీ లాస్ట్ మినిట్ లో జరిగిన భారీ చేంజ్ ఆయన లక్ కి ఎకసెక్కం చేసింది అన్నది అభిమానుల తీవ్ర ఆవేదన . దాంతో వారంత పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో వారిలో బాధను పోగొట్టేందుకు వర్మకు ముందస్తుగా భరోసా ఇచ్చేందుకు గన్ మెన్లను కేటాయించారు అని అంటున్నారు.
ఇక వర్మకు రేపటి రోజున మంత్రి పదవి కూడా వచ్చే రోజు ఉందని అంటున్నారు. ఇపుడు అయితే ఎమ్మెల్సీ పదవులు ఏవీ ఖాళీగా లేవు. కానీ తొందరలో ఏమైనా ఖాళీలు ఉన్నా లేక వైసీపీ వారు చేసిన రాజీనామాలను ఏదో విధంగా మండలి చైర్మన్ చేత ఆమోదించుకుని ఒక అరడజన్ ఎమ్మెల్సీ సీట్లను ఖాళీగా పెట్టి ఎన్నికలు జరిపించుకున్నా తొలి తాంబూలం వర్మకే అని అంటున్నారు. అలా ఎమ్మెల్సీ అయిన వెంటనే రాజులో కోటాలో మంత్రి కిరీటం కూడా ఆయనకు కన్ ఫర్మ్ గా ఉందని అంటున్నారు.
ఆ మధ్యన అంతా జనసేన వర్సే టీడీపీ అన్నంతగా పిఠాపురం నియోజకవర్గంలో రచ్చ సాగింది. అయితే పవన్ ఎపుడూ వర్మకు మర్యాద ఇస్తూనే ఉన్నారు అని అంటారు. పవన్ అధికారిక పర్యటనలు ఏవి జరిగినా వర్మను పక్కన పెట్టుకుంటారు అని చెబుతున్నారు. ఇక వర్మ త్యాగాన్ని పవన్ సైతం అర్ధం చేసుకున్నారని ఆయన కూడా సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని చెబుతున్నారు. ఇలా అన్నీ మంచి శకునములే పిఠపురం వర్మకు అంటున్నారు. అందుకే ముందున గన్ మెన్లు వెనక పదవి అని అభిమానులు అనుకుంటూ ముచ్చట పడుతున్నారుట.