అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. భవిష్యత్తులో చమురు ధరలు మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు బలంగా అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులైన చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడమే. రెండు దేశాలు సుంకాలు, ప్రతిసుంకాలు విధించుకుంటున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చమురు ధరలు కూడా రికార్డు కనిష్టాలకు పతనం అవుతున్నాయి.
శుక్రవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ చమురు ధర 0.6 శాతం తగ్గి 63.71 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) సూచీ 0.63 శాతం పతనమై 60.45 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత వారం ఈ రెండు కీలక సూచీలు ఏకంగా 11 శాతం మేర నష్టపోయాయి. వారం రోజుల వ్యవధిలో చూస్తే దాదాపు 2.5 శాతం నుంచి 3 శాతం వరకు విలువ కోల్పోయాయి. ఒకానొక దశలో బ్రెంట్ చమురు పీపా ధర 60 డాలర్ల దిగువకు కూడా చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది 2021 ఫిబ్రవరి నెల తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి.
తాజాగా చైనా కూడా అమెరికా వస్తువులపై భారీ మొత్తంలో ప్రతీకార సుంకాలను విధించడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పడిపోయేలా చేసింది. ఈ నిర్ణయంతో చమురు ధరలు రానున్న రోజుల్లో మరింత దిగిరావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. టారిఫ్‌ల ప్రతికూల ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో ఇంధన డిమాండ్ అంచనాలను కూడా తగ్గించింది. ప్రభుత్వ విధానాల్లోని అస్థిరత్వం మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే చైనా ఆర్థిక వృద్ధి రేటు కూడా గణనీయంగా తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనాపై అమెరికా విధిస్తున్న పన్నులు తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ పన్నుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ట్రేడ్ ఏజెన్సీ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం పతనమైతే, చమురు వినియోగంలో 1 శాతం తగ్గుదల వస్తుందని ఏఎన్‌జెడ్ బ్యాంక్ విశ్లేషకుడు డేనియల్ హెనెస్ అంచనా వేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను చైనా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతానికి టారిఫ్‌లను పెంచితే, డ్రాగన్ కూడా అదే స్థాయిలో స్పందించింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతానికి పెంచింది.
అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఇంకా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ ధరల తగ్గుదల.. భారత్‌లో ఎప్పుడు ప్రతిఫలిస్తుందో వేచి చూడాలి. ఇక్కడ ఇటీవల ఇంకా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచేశాయి. ఇక్కడ ఈ భారాన్ని ప్రజలపై పడనీయకుండా ఆయిల్ కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. బ్యారెల్ ధర $60 కంటే తక్కువగా పడిపోయింది. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే ధర తగ్గింపు సాధ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా అన్నారు. అయితే, ఈ ధర తగ్గింపు ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.94.77, డీజిల్ రూ.87.67 ఉండగా, హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు రూ.107, డీజిల్ రూ.95.65గా ఉన్నాయి.