`మనసు దోచేశారు సార్` ఇదీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా రాష్ట్రంలో వినిపిస్తున్న మాట. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మాత్రమే కాదు.. ఈ పథకంలో కొత్తగా 7800 మందిని ఈరోజు చేర్చడం. వారికి కొత్తగా పింఛన్లు కూడా మంజూరు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చిత్రపటాలకు అర్హులైన పింఛన్ తీసుకున్న లబ్ధిదారులు పాలాభిషేకం చేస్తున్నారు. ముఖ్యంగా మూడు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబును కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి ఒకటో తారీకు పింఛన్లు పంపిణీ చేయడం.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా వర్షాలు పడుతున్నా.. వరదలు ముంచెత్తినా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉదయాన్నే లబ్ధిదారులకు సిబ్బంది పింఛన్లను అందించారు. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాలు చేతిలో సొమ్ము పడగానే సంతోషం వ్యక్తం చేస్తూ `మనసు దోచేశారు సార్` అని ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. వాస్తవానికి ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. నిధులకు కొరత లేకుండా ఒక నెల ముందుగానే పింఛన్ల సొమ్మును అడ్వాన్సుగా పెట్టుకుంటున్నట్టు అధికారులు కూడా చెబుతున్నారు.
దీంతో ఒకటో తారీఖున ఖచ్చితంగా పింఛన్లు అందరికీ అందుతున్నాయి. సాయంత్రం 5 లోపే 99 శాతం మందికి పింఛన్లు ఇస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇక రెండో విషయానికి వస్తే ఇటీవల కొంతమందికి అనర్హులు అని పేర్కొంటూ పింఛన్లను నిలిపివేశారు. వీరిలో ముఖ్యంగా దివ్యాంగులు ఉన్నారు. వారికి ఇచ్చిన సదరం సర్టిఫికెట్లు నకిలీవని అర్హత లేకపోయినా పింఛన్లను పొందుతున్నారని పేర్కొంటూ అధికారులు చేసిన చిన్న పొరపాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టింది.
దీనిపై వెంటనే సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులు.. అనర్హులు అనే విషయాన్ని పక్కనపెట్టి సుదీర్ఘకాలంగా పింఛన్ తీసుకుంటున్న అందరికీ కచ్చితంగా పింఛన్ అందించాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు అసలు సర్టిఫికెట్లతో పని లేకుండా ఇప్పటికే నమోదయి ఉన్న, కొన్నాళ్లుగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు అందరికీ కూడా ఈరోజు పింఛన్లను పంపిణీ చేశారు. దీంతో వారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు మనసు దోచేశారు సార్ అంటూ నినాదాలు చేయటం విశేషం.
ఇక మూడోది భర్త చనిపోయిన భార్యలకు కూడా పింఛన్లు ఇస్తున్నారు. అంటే ఇప్పటికే భర్త పింఛన్ పొందుతూ ఉన్న కుటుంబాల్లో ఆయన చనిపోతే తదుపరి వారసురాలిగా ఆయన భర్తను పేర్కొంటూ స్పౌజ్ పింఛన్లను మంజూరు చేస్తున్నారు. వీటిని కూడా ఈరోజు నుంచే ప్రారంభించారు దాదాపు 7,800 లబ్ధిదారులకు 4000 చొప్పున పింఛన్ సొమ్మును అందించారు. దీంతో ఈ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపాయి.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మూడు వర్గాలు చంద్రబాబు పట్ల ఫిదా కావడం అనేది ఆశ్చర్యంగాను రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పింఛన్లు పంపిణీ చేయడం పెద్ద విషయం కాదని అందరికీ తెలిసినా.. అందులోనూ మానవీయ కోణాన్ని జోడించి పంపిణీ చేయడం అనేది చంద్రబాబుకే సాధ్యమైంది అన్నది లబ్ధిదారులు చెబుతున్న మాట.