పవన్ కళ్యాణ్ కి రాజకీయ అనుభవం లేదని ఆయనకు పెద్దగా వ్యూహాలు తెలియవు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్లే అంటారు రాజకీయ విశ్లేషకులు. పవన్ 2014 మార్చి లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకూ ఆయన వ్యవహరించిన తీరు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు చూస్తే కనుక ఆయన రాజకీయ వైఖరి అర్ధం అవుతుంది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బాబు తర్వాత కూటమిలో అంతటి వారుగా ఫోకస్ అవుతున్నారు. ఇదంతా కేవలం ఒకే ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచిన దానికే జరిగింది అంటే పవన్ రాజకీయం వేరే లెవెల్ అని అంటున్నారు.
ఇక చూస్తే పవన్ తెలుగుదేశం బీజేపీతో కలసి కూటమి కట్టారు. ఈ కూటమి ఏర్పాటు కోసం ఒకింత తగ్గారు. తనకు దక్కిన సీట్లను సైతం త్యాగం చేశారు. నిజానికి 2024 ఎన్నికల్లో 24 సీట్లు తీసుకున్నా లేక 21 తీసుకున్నా జనసేనకు సీఎం పదవి అయితే ఇవ్వరు, పైగా పవన్ ఒకసారి కూడా అప్పటికి ఎమ్మెల్యేగా గెలవలేదు, అందుకే అన్నీ ఆలోచించిన మీదటనే బాగా తగ్గారు. అలా తాను సర్దుకునిపోయే నాయకుడిని అని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మంత్రి పదవులు తీసుకున్నారు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అందుకున్నారు. జనసేన విషయంలో తీసుకుంటే ఇది బిగ్ అచీవ్ మెంట్ అనే చెప్పాలని అంటారు. ఆ పార్టీకి ఉన్న ఓటు షేర్ ని కూటమి కట్టడం ద్వారానే ఈ విధంగా సాధించగలిగారు అని అంటారు.
ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భారీ ఎత్తున సీట్లను డిమాండ్ చేస్తుంది అని ప్రచారం సాగుతోంది. అప్పటికి పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రిగా అయిదేళ్ల అనుభవం ఉంటుంది. అంతే కాకుండా రాజకీయంగా మరింత రాటు తేలతారు. దానికి తోడు బీజేపీ టీడీపీ పార్టీల రాజకీయ అవసరాలు అనివార్యతలు పవన్ కంటే ఎవరికీ పెద్దగా తెలియవు అని కూడా చెబుతారు. రాజకీయాల్లో ఇవే ఏ పార్టీని అయిన ముందుకు తీసుకుని వెళ్తాయి. కూటమితోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని టీడీపీ బీజేపీలకు కూడా ఉంది. జనసేన అదే బాహాటంగా చెబుతోంది. దాంతో ఈసారి అధిక సీట్లను డిమాండ్ చేయడం ఖాయమని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పునర్ విభజన జరిగితే ఓకే అదనంగా మరో యాభై సీట్లు పెరుగుతాయి. అలా కాదు అనుకున్నా కూడా ఉన్న 175 సీట్లలోనే కనీసంగా యభై సీట్లను తీసుకుని పోటీ చేయడానికి జనసేన చూస్తుందని అంటున్నారు.
ఈసారి ప్రభుత్వం వస్తే మరింత కీలకంగా వ్యవహరించడానికి జనసేన తనదైన వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది అని అంటున్నారు. ఇక 2029 లో మరోమారు కూటమి అధికారంలోకి వచ్చినా ఈ స్థాయిలో సీట్లు అయితే రావు, కచ్చితంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యేల మద్దతు మీద ప్రభుత్వం ఏర్పాటులో ఆధారపడక తప్పదని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అదే కనుక జరిగితే జనసేన రొట్టె విరిగి నేతిలో పడినట్లే అని అటున్నారు. అపుడు తమకు దక్కిన భారీ సీట్లతో జనసేన రాజకీయం 2029 తర్వాత వేరే లెవెల్ లో సాగుతుంది అని అంటున్నారు. మొత్తానికి జనసేన లెక్కలు పక్కాగానే ఉన్నాయని చెబుతున్నారు. చూడాలి మరి ఈ రాజకీయ విశ్లేషణలలో రేపటి వాస్తవ దృశ్యాలుగా ఎన్ని ఆవిష్కృతం అవుతాయో.