ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా ప్రొమోషన్‌కు పవన్ కల్యాణ్ బాగానే కష్టపడుతున్నారు. ఈవెంట్లలో పాల్గొంటూనే మరోవైపు.. పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీఎం చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను.. సినిమాలు చేసేందుకు సమయం సరిపోవడం లేదని చెప్పారు. దీంతో ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలు కూడా ఆగిపోయాయన్నారు.
అయితే.. నిర్మాతల నుంచి పదే పదే అభ్యర్థనలు రావడంతో సీఎం చంద్రబాబుకు వారి గురించి వివరించినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో ఆయన రోజుకు 2 గంటల సమయం తనకు ఇచ్చారన్నారు. ఇదే విషయాన్ని నిర్మాత, దర్శకుడికి చెప్పినప్పుడు వారు కూడా సహకరించి.. తనకు కుదిరిన సమయంలోనే షూటింగ్ పెట్టారని.. ఎక్కడికో వెళ్లి కూడా చేయాల్సిన కొన్ని సీన్లను తన పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో వేసిన సెట్టింగులలోనే తీసినట్టు తెలిపారు. ఇదంతా కూడా.. సీఎం చంద్రబాబు ఇచ్చిన సమయం వల్లే సాధ్యమైందని పవన్ కల్యాణ్ వివరించారు.
ఇక, మరో కీలక విషయంపై స్పందిస్తూ.. సినిమా టికెట్ ధరలు పెంచే విషయంపై నిర్మాత, దర్శకుడు తనకు విజ్ఞప్తి చేశారని అన్నారు. ‘సినిమాటో గ్రఫీ శాఖ.. మా వద్దే ఉందని(మంత్రి కందుల దుర్గేష్).. ధరలు పెంచాలని వారు కోరారు.” అని పవన్ వివరించారు. అయితే.. తాను స్వయంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించిన ఫార్మాట్‌లోనే ఒక పత్రం రూపొందించి.. సీఎం చంద్రబాబుకు పంపించానని.. ఆయన అన్ని విషయాలను పరిశీలించి.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారని అన్నారు. అంటే.. ఒక ప్రభుత్వం ఎలా అయితే.. పనిచేస్తుందో అలానే తాము నడుచుకున్నామని పవన్ చెప్పారు. ఇక, వైసీపీ నాయకులు కొందరు ‘బాయ్ కాట్’ పిలుపు ఇచ్చిన విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. తనకు అభిమానులే ముఖ్యమని.. ఎవరో ఏదో చేస్తారని తాను ఎప్పుడూ అనుకోనన్నారు. ప్రజలు, ప్రేక్షకుల ఆదరణ ఉంటేనే సినిమాలు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు.