ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్య భాగస్వామిగా జనసేన ఉంది తెలుగుదేశం పార్టీకి సోలోగా 135 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఆ తరువాత 21 మంది ఎమ్మెల్యేలతో రెండో స్థానం లో జనసేన ఉంది. దాంతోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రాధాన్యత కలిగిన పాత్రలో ప్రభుత్వంలో ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు అయితే ఏ మాత్రం రిలాక్స్ అవడం లేదు. ఆయన ఫోకస్ అంతా 2029 ఎన్నికల మీదనే పెట్టారు. ఒక విధంగా 2024 ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు 2029లో వైసీపీని ఓడిస్తేనే సంపూర్ణ విజయం దక్కినట్లుగా ఆలోచిస్తున్నారు. అందుకే బాబు ఎక్కడా ఆగకుండా తన పరుగుని అలాగే కొనసాగిస్తున్నారు.
టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను బాబు ఎప్పటికపుడు అలెర్ట్ చేస్తున్నారు పీరియాడికల్ గా ఆయన వారితో టెలి కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. వారి పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. తన వద్ద ఉన్న అధ్యయనాలు సర్వే నివేదికలను వారితో పంచుకుంటున్నారు. అంతే కాదు వారు మరింతగా జనంతో మమేకం కావాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలతో బాబు ముఖాముఖీ కూడా నిర్వహిస్తున్నారు ఎంత బిజీగా ఉన్నా ఎమ్మెల్యేలను నేరుగా కలుసుకుని వారితో అన్ని విషయాలను చర్చిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటిదాకా 24 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేతో బాబు సమావేశాలు నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తన పార్టీకి ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో పెద్దగా భేటీ అయింది లేదని అంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యేలు నెగ్గి 15 నెలలు అయింది. దాంతో వారి పనితీరు అన్నది జనంలో చర్చకు వస్తోంది. అందువల్ల వారికి అధినేత హోదాలో పవన్ మధింపు చేయాల్సి ఉంది. దాని కోసం పవన్ కూడా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించిన మీదట ముఖాముఖీ ఉంటుందా లేక ముఖా ముఖీ భేటీలే ఉంటాయా అన్నది మాత్రం చర్చగా ఉంది.
ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని అంటున్నారు. పోలవరం కి చెందిన జనసేన ఎమ్మెల్యేల మీద ఇటీవల వచ్చిన ఆడియో అయితే రాజకీయ కలకలం సృష్టించాయి అనే చెప్పాలి. మాజీ మంత్రి దేవినేని ఉమా జనసేన నేతల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలలో ఈ ఎమ్మెల్యే అవినీతి ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు దీంతో పాటు మరికొందరి విషయంలో ఇలాగే లోకల్ గా ఆరోపణలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత అందరి కళ్ళూ ఎమ్మెల్యేల మీదనే ఉంటాయి. దాంతో వారి పనితీరు బాగుండాలని జనసేన అధినాయకత్వం భావిస్తోంది. మరోసారి ఈ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే గెలిచేలా ఉండాలని భావిస్తుంది. అందుకే పవన్ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు. ఇక ఆయన ఇదే నెలలో ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు పనితీరు మెరుగుపరచుకోని వారికి సీరియస్ గానే క్లాస్ ఉంటుందని అంటున్నారు.
కూటమిలో మిత్రులుగా ఉన్న జనసేన బీజేపీలకు బాబు అనుభవమే స్పూర్తిగా ఉంది అని అంటున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా బాబు మిత్రులకు ఈ విధంగా సూచనలు చేశారు అని అంటున్నారు. ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోఅర్టులు రెడీ చేసి వారి పనితీరుని ఎప్పటికపుడు రివ్యూ చేయాలని జనసేన బీజేపీలను కోరినట్లుగా చెబుతున్నారు. దాంతో జనసేన బీజేపీ అధినాయకత్వాలు ఆ దిశగా తమ పార్టీ ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. 2029 ఎన్నికల్లో కూడా మిత్రులతో కలసి పనిచేయడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. అందువల్ల తమ పార్టీతో పాటు మిత్రులు కూడా దూకుడుగా ఉండాలని అంతా కలిస్తే మరోమారు వైసీపీని అధికారానికి దూరం పెట్టవచ్చు అన్నదే బాబు ఆలోచన అని చెబుతున్నారు.